హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె జానా రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. రేవంత్‌ను జానారెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఇద్దరు గంటసేపు చర్చించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నల్లగొండ నుంచి ఎంపిగా పోటీ చేస్తానని వివరణ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లు మంత్రిగా సేవలు అందించాలని, తన కుమారుడు జైవీర్ ఎంఎల్‌ఎగా గెలిచారని, పదవి మాత్రం అడగలేదన్నారు. తన కుమారుడు ఇప్పుడు జూనియర్‌గా ఉన్నారని ఇంకా నేర్చుకుంటున్నాడని, ఇప్పుడే పదవులు అడగలేమని జానా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ సహకరించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాభిమానం సొంతం చేసుకోవాలని రేవంత్ రెడ్డికి జానా సూచించారు. సిఎం, మంత్రులు అందరూ కలిసి పని చేయాలని, తాను ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా లేనన్నారు. ప్రజలు ఇచ్చిన ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు గాయం కావడం బాధాకరమైన విషయమని, ఆయనని పరామర్శించానని, కెసిఆర్ త్వరగా కోలుకోవాలని, ప్రతిపక్షనాయకుడిగా ఆయన సూచనలు తెలంగాణ ప్రభుత్వానికి చాలా అవరసమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జానా రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ప్రస్తుత రాజకీయాలపై ఇద్దరు చర్చలు జరిపినట్టు సమాచారం.