Thursday, November 21, 2024

కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసిసి అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజాగా అమలు చేసిన రైతు రుణమాఫీ సహా పలు అంశాలపై రాహుల్‌గాంధీతో సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు చర్చించారు. రుణమాఫీ మూడు దఫాలుగా ఇవ్వనున్నామని, మెదటి విడతలో భాగంగా రూ.6వేల కోట్లతో రూ.లక్ష లోపు రుణమాఫీ చేసినట్లు రాహుల్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ నెలాఖరున నిర్వహించే వరంగల్ కృతజ్ఞతా సభకు రావాలంటూ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశాం: డిప్యూటీ సిఎం
సమావేశం అనంతరం డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలు తీరును వారికి వివరించినట్లు భట్టి చెప్పుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ హామీల అమలుతీరు విధానాన్ని అగ్రనేతలకు వివరించామని ఆయన తెలిపారు.

గతంలో గ్యాస్ కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే ఖాతాదారుల అకౌంట్‌లలో సబ్సిడీ పడేదన్నారు. ప్రస్తుతం దీనికోసం ప్రభుత్వ ఖాతాలో ముందుగానే రూ.10 కోట్లు డిపాజిట్ చేసినట్లు వివరించినట్లు డిప్యూటీ సిఎం చెప్పారు. రూ.500లకే సిలిండర్ ఇస్తున్నామని, భవిష్యత్‌లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు చెప్పామన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి పిసిసి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. రాహుల్ గాంధీని త్వరలో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినట్లు డిప్యూటీ సిఎం భట్టి చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News