Monday, December 23, 2024

దటీజ్ జానా!

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కుశల ప్రశ్నలు వేశారు. ఇద్దరూ కాసేపు మంచీ చెడూ మాట్లాడుకున్నారు. అయితే, ఇక్కడ చెప్పుకోవలసిన మరొక విశేషం ఉంది. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇంట్లో జానారెడ్డి కుమారులు ఇద్దరూ లేరు. ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన జైవీర్ కూడా లేకపోవడం కాంగ్రెస్ నాయకులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే దీనికి కారణం లేకపోలేదు.

జానారెడ్డి, రేవంత్ రెడ్డి కుటుంబాల మధ్య చిరకాల స్నేహం ఉంది. జానారెడ్డి పట్ల రేవంత్ కు గురుభావం ఉందనడంలో  సందేహం లేదు. రాజకీయ కురువృద్ధుడిగా, నిజాయితీగా రాజకీయాల్లో కొనసాగుతున్న నేతగా జానారెడ్డి పట్ల రేవంత్ కు ఎంతో గౌరవం ఉంది. అదే గౌరవంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాలుగు రోజులకే రేవంత్.. జానారెడ్డి ఇంటికి వెళ్లారు.

అయితే, వచ్చేది ముఖ్యమంత్రే అయినా జానారెడ్డి హంగూ ఆర్భాటాలకు పోలేదు సరికదా, ముఖ్యమంత్రి తనను మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పుడు తన కుమారులకు అక్కడ పనేం లేదని వారిని పంపించివేశారు. వచ్చేది సిఎం కదా అని కొందరు బడా నాయకులు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తే, వినమ్రంగా వారించారు. జానా ఇంటికి రేవంత్  వచ్చినప్పుడు అక్కడ ఆయన కుటుంబ సభ్యులెవరూ లేకపోవడానికి కారణం అదే. జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ గానీ, మొన్ననే నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జైవీర్ గానీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు లేరు. జానారెడ్డి తన సతీమణితో కలసి రేవంత్ ను సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ గంట సేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.

ముఖ్యమంత్రి వచ్చి వెళ్లాక జానారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తన కుమారుడు జైవీర్ కు మంత్రి పదవి అడగలేదని చెప్పడం గమనార్హం. పైగా తన కుమారుడు ఎమ్మెల్యేగా జూనియర్ అని, పదవులు అడగడం, ఇవ్వడం సమంజసం కాదనీ వ్యాఖ్యానించడం ఆయన సంస్కారానికి గీటురాయి అని పలువురు కాంగ్రెస్ నేతలే ప్రశంసించడం గమనార్హం. కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఎంపిగా పోటీ చేస్తానని గతంలోనే చెప్పిన జానారెడ్డి.. ఇప్పుడు కూడా పార్టీ ఆదేశిస్తేనే పోటీ చేస్తానని అన్నారు. దటీజ్ జానా!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News