Wednesday, February 26, 2025

ఢిల్లీకి సిఎం

- Advertisement -
- Advertisement -

 నేడు ప్రధాని మోడీతో భేటీ
బిసి రిజర్వేషన్ల తీర్మానానికి ఆమోదం
తెలపాలని కోరనున్న సిఎం
మధ్యాహ్నం కుంభమేళాకు
సాయంత్రం పార్టీ పెద్దలతో సమావేశం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ
అభ్యర్థుల ఎంపికపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయనున్నట్టు ఇదివరకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం కేంద్రానికి పంపించే తీర్మానాన్ని సాధ్యమైనంత త్వరగా ఆమోదం తెలపాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు విజ్ఞప్తులపై కూడా ప్రధానితో సీఎం చర్చించనున్నారని తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, మెట్రో రైలు పొడిగింపు ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపు వంటి కీలక అంశాలపై ప్రధానిని సీఎం మెమొరాండం ద్వారా విజ్ఞప్తి చేయనున్నారు.

నగరాభివృద్ధిలో భాగంగా కేంద్రం నుంచి మరిన్ని సహాయ నిధులను కోరే దిశగా ఈ భేటీ కొనసాగనున్నట్లు సమాచారం. ఇక ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర కేబినెట్‌లోని పలువురు కీలక మంత్రులను కూడా కలవనున్నట్లు చెబుతున్నారు. ప్రధానమంత్రితో చర్చించే అంశాలపై ముఖ్యమంత్రికి వివరించేందుకు అధికారుల బృందం కూడా ఆయనతో పాటు ఢిల్లీకి చేరుకుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు మద్దతుగా కేంద్ర మంత్రుల వద్ద ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితోపాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితర ఉన్నతాధికారులు సీఎం వెంట ఉంటారని సమాచారం.

కుంభమేళాకు : ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం అక్కడి నుంచి కుంభమేళాకు కూడా వెళ్లనున్నారని సమాచారం. కుంభమేళాకు రావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎ ంపికపై అధిష్ఠానంతో చర్చ : కుంభమేళా బుధవారం ముగియనుండటంతో అక్కడికి మధ్యాహ్నం చేరుకొని సాయంత్రానికి తిరిగి ఢిల్లీకి చేరుకొని పార్టీ పెద్దలను కలుస్తారని సమాచారం. ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ పదవులు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కనుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News