Wednesday, January 22, 2025

కౌలు రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గుంట జాగ లేకపోయినా వ్యవసాయం పై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కౌలు రైతులకు బహిరంగ లేఖ రాశారు. ఆరు గాలం కష్టించి సాగు చేస్తున్న రైతుగా పొందాల్సిన ఏ మేలు పొందలేకపోతున్నారని ఆయన అన్నారు. పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం.. ఇలా ఏ సాయం అందక మీరు నరకయాతనను అనుభవిస్తున్నారు, రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ వేదనతోనే గడుపుతున్నారు. అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కౌలు రైతులను ఆదుకుంటుందని హామినిచ్చారు. రాష్ట్రంలో మీ లాంటి రైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40 శాతం మేర సాగు భూమి మీ అధీనంలోనే ఉంది. అయినా ప్రభుత్వం మీపై కనికరం చూపడం లేదు. దీంతో బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది.

పంట నష్టపోతే పరిహారం అందకపోవడం, అధిక వడ్డీ భారంతో అప్పుల ఊబిలో కూరుకోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతం మంది మీలాంటి వారే ఉండటం విషాదకరం. అని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. సొంత భూమి లేని మీ లాంటి రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించడం తప్పనిసరవడం, గిట్టుబాటు ధర దక్కక కుదేలవుతున్నారు. కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి పెట్టుబడి పెట్టి సాగులోకి దిగినా భవిష్యత్ మీద బెంగ గుండెల మీద కుంపటిలాగా సెగపుట్టిస్తూనే ఉందని రేవంత్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న మీ లాంటి రైతులను ఆదుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు గాలికొదిలేశాయని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై గురుతర బాధ్యత ఉందని, ఇక్కడ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యత ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సాగుకు పూర్వవైభవం తేవడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే పరిస్థితులను విశ్లేషించి సాగు చేసే ప్రతి ఒక్కరికి భరోసా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ గతేడాది ప్రకటించిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు, ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉపాది హామీ లో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామన్నారు. రైతులు పండించిన అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కౌలు రైతులు ఆ దైర్యపడొద్దు. మీ భవిష్యత్ కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రాబోయే వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ తలరాతను మారుస్తుంది. అని రేవంత్ అన్నారు. . కౌలురైతు కూడా రైతేనని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలతో సహా అన్ని పథకాలను వర్తింపచేస్తామని అయనన్నారు. రైతులకు పావలావడ్డీకే రుణాలు, పంటల బీమా, రైతు బీమా, ఇందిర జలప్రభ, రాయితీ విత్తనం, ఇన్పుట్ సబ్సిడీలు, పండిన పంటకు మద్దతు ధర, పంటల కొనుగోలుకు ఐకేపీ కేంద్రాల ఏర్పాటు వంటి సమగ్ర రైతు అనుకూల నిర్ణయాలతో వ్యవసాయాన్ని పండగ చేసింది కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News