రాజంపేట్ : అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం పొందుర్తి గ్రామంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో అకాల వర్షం, వడగండ్ల వానకు నష్టపోయిన రైతుల వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి గట్టుబాటు ధర కల్పించేంత వరకు పోరాడుతామన్నారు. రైతులు అధైర్యపడొద్దని నష్టం వివరాలను ప్రభుత్వం సేకరించాలని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కెసిఆర్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఎలక్షన్లో హామీలు ఇచ్చి రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతుల ఓట్లతో గెలిచి రైతులను ఆదుకోవడం లేదన్నారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఓవైపు అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే మరోవైపు ఆత్మీయ సమావేశాలు, తాగుబోతు సమావేశాలు నిర్వహిస్తూ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం రైతలతో కలసి వరిధాన్యాం కుప్పలను పరిశీలించారు. రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల వివరాలు అడిగి తెలసుకుని వారికి కాంగ్రెస్ పార్టీ భరోసా అవ్వాలన్నారు.
ఈ విషయమై బిజెపి చీఫ్ బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. ఎకరాని రూ.20వేల నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని తెలిపారు. రానున్న ఆరు నెలల్లో ఇందిరమ్మ కలలు కన్న రాజన్న రాజ్యం వస్తుందని రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆయన వెంట మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి, యూత్ అధ్యక్షుడు కృష్ణరావు కార్యకర్తలు ఉన్నారు.