Sunday, January 19, 2025

రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి
పొంగులేటి, జూపల్లిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం
త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగ సభ
ఒక్క అవకాశం ఇవ్వండి.. బతుకుల తెలంగాణ మారుస్తాం…
పొంగులేటి, జూపల్లితో భేటీ అనంతరం మీడియాతో పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం తాము పునాదులు వేస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వారు ఆహ్వానించారు. దాదాపు రెండు గంటల పాటు పొంగులేటి నివాసంలో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. ఎఐసిసి ఆదేశాల మేరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించామని చెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని.. వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఖమ్మంలో కాంగ్రెస్‌కు రేణుకా చౌదరి, మల్లు భట్టి విక్రమార్క కీలక భూమిక పోషిస్తున్నారని, వారి అందరి సూచనలు, సలహాలతోనే తాము పొంగులేటిని, ఆయన మిత్రులను పార్టీలోకి ఆహ్వానించామన్నారు. పొంగులేటి నుంచి సానుకూల స్పందన వచ్చిందని వెల్లడించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గే, రాహుల్‌తో చర్చించి, వారి ఆశీస్సులతో త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు.

వ్యక్తులు ఎప్పుడూ వ్యవస్థ ముందుకు తలవంచక తప్పదన్నారు. ఖమ్మం జిల్లా ముఖ్య నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదన్నారు. అధికారమే ముఖ్యమని అనుకుంటే సోనియా గాంధీ రెండు సార్లు ప్రధాన అయ్యేవారన్నారు. ఎపిలో పార్టీకి నష్టం జరిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని చెప్పారు. పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కూడా తమ చర్చల్లో పాల్గొన్నారని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలని, తాము బంగారు తెలంగాణ చేస్తామని మోసపు మాటలు చెప్పమన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ఐదేళ్లలో బతుకుల తెలంగాణగా మారుస్తామని తెలిపారు. ఖమ్మంలో జరిగే సభకు స్వచ్చదంగా కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News