Monday, December 23, 2024

భారత్ జోడో గర్జననను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆదివారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేషమైన స్పందన వస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసానిస్తూ రాహుల్ యాత్ర సాగుతోందని తెలిపారు. ఇడి, సిబిఐ దాడులు చేసినా, తన ప్రాణానికి ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినా రాహుల్ గాంధీ వెనకడుగు వేయకుండా పాదయాత్ర చేపట్టారన్నారు. ఎన్నికలు, ఓట్ల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టలేదని చెప్పారు. దేశ విశాల ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం తనకు దేవుడిచ్చిన వరం అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం పోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేశారన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌కు దక్కతుందన్నారు. తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుందని చెప్పారు. రేపు రాహుల్ యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు వీడ్కోలు పలికేందుకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూరులో నేడు భారత్ జోడో గర్జన సభను నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభకు భారీగా జనం తరలిరావాలని పిలుపునిచ్చారు. ‘కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం దేశంలో జరుగుతుంది. దేశ ప్రజలు అభద్రత భావంలో ఉన్నారు. అణగారిన వర్గాలకు గొంతు లేకుండా పోయింది. పుట్టినప్పుడు ఎవరూ నాయకులు కాదు. క్రైసిస్ వచ్చినప్పుడే మాత్రమే నాయకులు ఉద్భవిస్తారు. గాంధీ, నెహ్రూ, బోస్, పటేల్ ఈ కోవకు చెందిన వారే. ఎనిమిదేళ్లలో మోడీ, కెసిఆర్, అమిత్ షా దేశాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఒక నాయకుడిగా ఎదిగారు. దేశానికి దశ, దిశ ఇచ్చే నాయకుడిని ప్రజలు రాహుల్ గాంధీలో చూసుకుంటున్నారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా రాహుల్ సిద్ధంగా ఉన్నారు. జోడో యాత్రలో వివిధ వర్గాలు వారి సమస్యలు రాహుల్ కు వివరిస్తున్నారు. ప్రభుత్వాలు పరిష్కరించని సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకువస్తున్నారు. 80 ఏళ్ల వృద్ధులు కూడా రాహుల్ గాంధీతో యాత్రలో పాల్గొంటున్నారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలకు రాహుల్ పరిష్కరిస్తారని జనం నమ్ముతున్నార’ని రేవంత్ అన్నారు.

Revanth Reddy press meet about Bharat Jodo Yatra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News