మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి విదితమే. తాజాగా ఈ వివాదంపై టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి స్పందించారు. సోమవారం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ఇష్యూ తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారని తెలిపారు. జగ్గారెడ్డి అధిష్టానాన్ని అపాయింట్‌మెంట్ కోరారని.. జగ్గారెడ్డికి తామంతా అండగా ఉంటామని రేవంత్ చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. గతంలో విహెచ్‌పై కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని రేవంత్ చెప్పారు. పిసిసి చీఫ్‌గా కొన్ని విషయాలు తాను బయటకు చెప్పలేనని అన్నారు. జగ్గారెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని రేవంత్ తెలిపారు. జగ్గారెడ్డి విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాకు సిద్ధమై జగ్గారడ్డిని పలువురు సీనియర్ నేతలు బుజ్జగించడంతో ఆయన తన నిర్ణయాన్ని 15 రోజులు వాయిదా వేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీకి ఆయన లేఖ రాశారు. అయితే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టి.కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాగూర్‌తోనే జగ్గారెడ్డి సమస్య ఉన్నది బహిరంగ రహస్యమే. సోనియా, రాహుల్‌కు రాసిన లేఖలో కూడా రేవంత్‌రెడ్డిపై పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక, జగ్గారెడ్డి వ్యవహారాన్ని కుటుంబంలో సమస్యగా చెప్పిన రేవంత్‌రెడ్డి.. అన్ని సమస్యలు తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. మీడియా ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదన్నారు. టీ కప్పులో తుపాను మాదిరే ఈ సమస్య కూడా పరిష్కారవుతుందని చెప్పారు. తమ పార్టీలో విభదాలు లేవని, బేదాభిఫ్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. అయితే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పుబట్టారు. తన సమస్య పార్టీ అంతర్గతం అని పిసిసి అధ్యక్షుడు అనడం సహజమని.. కానీ టీ కప్పులో తుపాన్ అని కొట్టి పారేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సమస్య ఎందుక వచ్చిందో ఆలోచించడం లేదన్నారు. మాణికం ఠాగూర్, కెసి వేణుగోపాల్‌తో తన సమస్య పరిష్కారం కాదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీలను కలిస్తే తన సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లుగా చెప్పారు.
Revanth Reddy Reacts on Jaggareddy Comments