Thursday, December 26, 2024

టీ కప్పులో తుఫాన్ అంతే: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి..

- Advertisement -
- Advertisement -

Revanth Reddy reacts on Jaggareddy's comments

మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి కాంగ్రెస్ ఎంఎల్‌ఎ తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) పార్టీ వీడుతున్నట్లు సోనియాగాంధీకి లేఖ రాయడంపై టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డి అంశాన్ని సానుకూలంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు. ప్రజల సమస్యల ముందు తమ సమస్యలు చాలా చిన్నవని చెప్పారు. జగ్గారెడ్డ సమస్య టీ కప్పులో తుఫాను లాంటిదని తేల్చేశారు. కాంగ్రెస్‌లో వ్యక్తుల సమస్యలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌లో విభేదాలు లేవని.. భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కుటుంబం అన్నాక భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తాయని సమసిపోతూ ఉంటా యని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని స్పష్టం చేశారు. తమ పార్టీలో భిన్నాభిప్రాయాలను చర్చించుకుని ఏక నాయ కత్వంలో పనిచేస్తామని చెప్పారు. తమ అందరి నాయకురాలు సోనియాగాంధీ అని.. ఆమె మార్గదర్శకత్వంలో పనిచేస్తామని చెప్పారు. జగ్గారెడ్డి, రాఘవరెడ్డి…ఇలా ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. అంతకు ముందు సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి బోస్ రాజులు జగ్గారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ లోపల ఉండి కొట్లాడాలని సూచించారు. పార్టీని వీడొద్దని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు జగ్గారెడ్డిని పార్టీ వీడకుండా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. జగ్గారెడ్డిని ఇంటికి వెళ్లి ఆయనను కలిసి మాట్లాడారు. జగ్గారెడ్డి ఇంటికి చేరుకున్న పిసిసి జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్.. కాంగ్రెస్‌ని వీడొద్దని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేశారు. జగ్గారెడ్డి కాళ్లపై పడి పార్టీ మారొద్దని కిషన్ బతిమిలాడారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలోకి వెళ్లనని జగ్టారెడ్డి తెలిపారు. తాను టిఆర్‌ఎస్ కోవర్టునా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనకు పార్టీలో అవమానం జరిగిందని అన్నారు. టిఆర్‌ఎస్‌లోకి పోవాలంటే రెండేళ్ల క్రితమే పోయేవాడినని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా.. అవమానాల పాలు కావాలా అని ప్రశ్నించారు. పిసిసి పద్ధతి బాగోలేదని విమర్శించారు. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపి రాహుల్‌గాంధీలకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ రాసిన మరుక్షణం తాను పార్టీలో లేనట్లేనని అన్నారు. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పిసిసి కావొచ్చని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గపోరు ఉండేదని జగ్గారెడ్డి గుర్తు చేశారు. త్వరలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటానని.. పార్టీలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న అవమానాలు భరించేకనే రాజీనామా చేసి ప్రజల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని ఆయన చెప్పారు. పార్టీలో ఎవరు కోవర్టులో అధిష్టానం గుర్తించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 2017లో ఎవ్వరూ అధినేత రాహుల్‌గాంధీ సభ పెట్టడానికి ముందుకు రాకుంటే తాను కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించానని.. ఆ సభ నుండి పార్టీ రాష్ట్రంలో బలపడింది… పార్టీ కోసం కష్టపడిన తాన కోవర్టుని.. సభను నిర్వహించకుండా ఉన్న నేతలా కోవర్టులు? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇటీవల పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పెట్టకుంటే తాను మెదక్ జిల్లా నుంచి అభ్యర్థిని నిలబెట్టానన్నారు. కోట్లు ఖర్చు పెట్టి పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పరువు నిలిపానని ఆయన తెలిపారు. పార్టీ సీనియర్లు ఎవరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు.. ఎవరు కోవర్టులు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడు వేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్లు కోవర్టులా? తానా అని ఆయన నిలదీశారు. గాంధీ కుటుంబంపై బిజెపి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండిచింది తానేనని జగ్గారెడ్డి గుర్తు చేశారు. మరి పార్టీలో పదవులు అనుభవిస్తూ.. స్పందించకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్టులా అనేది అధిష్టానం గుర్తించాలని ఆయన హితవు పలికారు.

Revanth Reddy reacts on Jaggareddy’s comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News