Monday, December 23, 2024

పీకే కాంగ్రెస్‌లో చేరాక రాష్ట్రానికి వస్తారు: రేవంత్

- Advertisement -
- Advertisement -

పీకే కాంగ్రెస్‌లో చేరాక రాష్ట్రానికి వస్తారు..
నాతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్‌లో పాల్గొంటారన్న రేవంత్
శత్రువుతో స్నేహం చేసేవారిని నమ్మొద్దు
మాణికం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: పీకే కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి.. తనతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ సర్కార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ భేటీకి సంబంధించి పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే.. టిఆర్‌ఎస్ సర్కార్‌ను కలిశారన్నారు. ఇకపై ప్రశాంత్ కిషోర్‌కు, టిఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చారు. ఐప్యాక్‌తో కూడా పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. అప్పుడు పీకే నోటి నుంచి టిఆర్‌ఎస్‌ను ఓడించండని చెప్పడం వింటారని అన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన అధిష్టానం మాటే ఫైనల్ అని అన్నారు. ఇక, ఓడిపోతామనే భయంతోనే టిఆర్‌ఎస్ సర్కార్ వ్యూహకర్తను పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎవరితో పొత్తు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. మే 6వ తేదీన వరంగల్‌లో జరిగే సభలో రాహుల్‌గాంధీ ఇదే అంశంపై స్పష్టత ఇస్తారన్నారు. మరోవైపు పీకే, టిఆర్‌ఎస్ సర్కార్ భేటీపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ పరోక్షంగా ట్వీట్లు చేశారు. శత్రువుతో స్నేహం చేసేవారిని నమ్మొద్దని అన్నారు.
ప్రశాంత్ కిషోర్‌ను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు నష్టాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చర్చోపచర్చలు…
మరోవైపు ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలను అంగీకరించాలా..? వద్దా..? అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం సమావేశమైంది. ప్రశాంత్ కిషోర్ సమర్పించిన ప్రతిపాదనపై చర్చించడానికి ఢిల్లీలోని 10 జనపథ్‌లోని సోనియాగాంధీ నివాసంలో.. ఆమెతో ఏడుగురు సభ్యుల కమిటీ సమావేశం అయింది. ఈ కమిటీలో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, అంబికా సోనీ, జైరాం రమేష్, దిగ్విజయ్ పసింగ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా ఉన్నారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేత ఎకె ఆంటోనీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలోకి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలపై నేతలు చర్చిస్తున్నారు. అలాగే పార్టీలోకి తీసుకుంటే ఏ విధమైన బాధ్యతలు అప్పగించాలనే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ.. ఈ విషయంలో ఇప్పటికే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఇప్పటికే సోనియాగాంధీతో పలుమార్లు సమావేశమైన ప్రశాంత్ కిషోర్.. గత కొంతకాలంగా వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయడానికి తన ప్రణాళికపై వివరణాత్మక ప్రదర్శనలు ఇచ్చాడు. అయితే, కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్న కొన్ని పార్టీలతో పీకే పనిచేస్తున్న కారణంగా కాంగ్రెస్ సీనియర్లలో ఒక విభాగం ఆయన చేరికపై అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు.

Revanth Reddy reacts on Prashant Kishor to join Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News