తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని నానుడి. తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటివాడే. ప్రత్యర్థి ఎత్తులకు పైయెత్తులు వేయడంలో దిట్ట. ఎదుటివాడు ఎంతటివాడైనా సై అంటే సై అనే సాహసి. తడుముకోకుండా ధాటిగా, సూటిగా మాట్లాడే తత్వం. దూసుకుపోయే మనస్తత్వం. అందుకనే కాంగ్రెస్ లో చేరిన ఆరేళ్లకే ముఖ్యమంత్రి పదవి లభించింది. నిజానికి వందేళ్ల పైబడిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇంత త్వరగా ముఖ్యమంత్రి పదవిని అందుకున్న వారు లేరనే చెప్పాలి. కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరొందిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పార్టీలో చేరాక తర్వాత పాతికేళ్లు ఆగితే కానీ ముఖ్యమంత్రి పదవి అందలేదు. మధ్యలో రెండుసార్లు ఆయనకు సీఎం పదవి అందినట్టే అంది చేజారిపోయింది. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన 17 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం విశేషం.
కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నా ఫైర్ బ్రాండ్ నాయకులు తక్కువమందే ఉన్నారు. ఈ కోవకు చెందినవారే వైఎస్ రాజశేఖరరెడ్డి. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనకు తెరదించి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వైఎస్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత కూడా ఆయన తన దూకుడు మనస్తత్వానికి అడ్డుకట్ట వేయలేదు. సభలో చంద్రబాబుపైనా, కేసీఆర్ పైనా చతురోక్తులు విసురుతూ, విమర్శనాస్త్రాలు సంధిస్తూ కట్టడి చేసేవారు. ఇలాంటి మనస్తత్వమే రేవంత్ ది కూడా.
ప్రత్యర్థులపైకి దూకుడుగా వెళ్లడం, మాటకు మాట సమాధానం చెప్పడం, సవాళ్లు విసరడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం రేవంత్ సహజ స్వభావం. ఇదే ఆయనను విలక్షణమైన నాయకుడిగా నిలబెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించడానికి కూడా రేవంత్ ఏనాడూ వెనుకాడలేదు. అధికారపక్షం వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తనదైన రీతిలో వివిధ సంక్షేమ పథకాల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఆయన చేసిన ప్రసంగాలు కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి.