Monday, December 23, 2024

పార్టీయే ముఖ్యం… పిసిసి చీఫ్‌గా తప్పుకుంటా: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిసిసి వదులకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. పార్టీలో చిన్న చిన్న గొడవలున్నా సర్దుకుపోవాలని, పది పనులు చేస్తుంటే ఒకటో రెండో తప్పులు దొర్లటం సహజమేనన్నారు. మనం మనుషులమని, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. కానీ ఎవర్నీ ఇబ్బంది పెట్టాలని కాదని తెలిపారు. జానా, భట్టి, యాష్కీ, సంపత్ సూచనలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. జానా సలహాలు, సూచనలతో పార్టీని మూల మూలలకు తీసుకెళ్తామన్నారు. ప్రజలకు నష్టం జరిగే చర్యలకు కాంగ్రెస్ పాల్పడదని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తా. పిసిసి పీఠంపై వేరొకరిని కూర్చొబెట్టినా తన భుజాలపై మోస్తాను.

పార్టీ శ్రేయస్సు కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. పార్టీ ఏం ఆదేశించినా సామాన్య కార్యకర్తలా పనిచేస్తా. పదవి ఉన్నా లేకున్నా కట్టుబడి పనిచేస్తా’నని రేవంత్ తెలిపారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశానని పేర్కొన్నారు. 200304లో ఉన్న పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టాలని ప్రజలే విజ్ఞప్తి చేస్తున్నారని వెల్లడించారు. గతంలో రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియాగాంధీ పదవి స్వీకరించలేదు. దేశానికి మంచి నాయకత్వాన్ని అందించారు. ప్రతి గడపను తట్టి రాహుల్‌గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం. అందరి సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. కలిసికట్టుగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయ’మని రేవంత్ అన్నారు.

దిశా నిర్దేశన…
కాగా, ఈ శిక్షణా తరగతుల్లో భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రంలో చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమ ప్రణాళికపై దిశానిర్దేశన చేశారు. అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ విభజించు పాలించు విధానంతో ముందుకెళ్తున్న బిజెపి పరిపాలనకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని చెప్పారు. రాహుల్‌గాంధీ సందేశాన్ని ప్రతి గడపకు చేరవేసి పార్టీని పటిష్టం చేసేందుకే హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. హాత్ సే హాత్ జోడో అభియాన్‌తో పాటు ధరణి సమస్యలపై పోరాటం, ఎన్నికల నిబంధనలు, బీమా, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై దిశా నిర్దేశన చేస్తున్నారు.

‘స్వాతంత్య్రం వచ్చిన ఆరు నెలలకే మహాత్మాగాంధీని కాల్చి చంపారు. గాంధీని చంపిన రోజే బిజెపి దేశంలో విషబీజాలు నాటింది. మళ్లీ నేడు విస్తృత రూపం తీసుకువచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొడుతోంది. దేశాన్ని తిరిగి కాపాడే బాధ్యతను రాహుల్‌గాంధీ తీసుకున్నారు. రాహుల్‌గాంధీ ఆశయాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంద’ని సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్యక్రమంలో సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి బోసురాజు, ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి, నేతలు కోదండరెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవితో పాటు నియోజకవర్గాలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాగా, శిక్షణా తరగతులకు ముందుగా పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించగా, ప్రముఖ కవి అందేశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటతో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News