హైదరాబాద్: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లకు కీలక బాధ్యతలను టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఐదు మంది వర్కింగ్ ప్రెసిడెంట్లకు పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటు స్థానాలు, అనుబంధ సంఘాల పని విభజన చేసే బాధ్యతలు అప్పగించారు. ఎవరెవరకి ఏయే బాధ్యతలు అప్పగించారో తెలియజేస్తూ రేవంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షురాలు జె.గీతారెడ్డికి.. సికింద్రాబాద్, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలతో పాటు ఎన్ఎస్యూఐ, ఇంటిలెక్చువల్ సెల్, రీసెర్చ్ విభాగం, ప్రొఫెషనల్ కాంగ్రెస్ భాధ్యతలను అప్పగించారు.
అంజన్‌కుమార్ యాదవ్‌కు నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు యువజన కాంగ్రెస్, మైనార్టీ విభాగం, ఫిషర్మెన్ విభాగాన్ని అప్పగించారు. అజరుద్దీన్‌కు ఆదిలాబాద్, జహీరాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలతో పాటు పార్టీ సామాజిక మాధ్యమ విభాగాన్ని పర్యవేక్షించనున్నారు. సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్, యాదాద్రి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్టియూసి, లేబర్ సెల్, అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ సెల్‌లను పర్యవేక్షించనున్నారు. ఇక మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల పార్లమెంటు స్థానాలతో పాటు ఓబిసి, ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్, సేవాదళ్ విభాగాలను మహేశ్‌కుమార్ గౌడ్ పరిశీలిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.