Friday, December 27, 2024

రామోజీరావు మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

ఆయన మరణం మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటు
మనతెలంగాణ/హైదరాబాద్: ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మృతిపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకు దక్కుతుందన్నారు. రామోజీరావు తెలుగువారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తి అని సిఎం కొనియాడారు. రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అని సిఎం రేవంత్ అన్నారు.

పత్రిక నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్‌వన్ స్థానంలో నడపడం, ఈటివి స్థాపనతో టివి మీడియా రంగానికి దశాదిశా చూపిన దార్శనికుడు రామోజీరావు అని సిఎం పేర్కొన్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో భేటీ అయిన సందర్భాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రామోజీరావు లేని లోటు తెలుగు మీడియా రంగానికి, వ్యాపార రంగానికి తీరని లోటని సిఎం అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సిఎం రేవంత్ తెలియజేశారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు…

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌లకు సిఎస్ శాంతికుమారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News