Saturday, January 11, 2025

బిజెపి డబుల్ ఇంజన్ అంటే అదానీ-ప్రధాని: చీఫ్ రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుతున్నారని విమర్శించారు. తన మిత్రుల కోసం ప్రధాని మోడీ దేశాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 7న అదానీ కుంభకోణంపై లోక్ సభలో ప్రశ్నించారని దీంతో ప్రధాని ఉక్కిరి బిక్కిరై సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బిజెపి డబుల్ ఇంజన్ అంటే అదానీ-ప్రధాని అని ఎద్దేవా చేశారు. నేరుగా రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేకే కుట్రపూరితంగా ఆయనపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. బిజెపి ప్రభుత్వం హడావుడిగా రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. అది బ్రిటీష్ జనతా పార్టీ
బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. అది బ్రిటీష్ జనతా పార్టీ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నాడు బ్రిటీష్ విభజించు. పాలించు విధానాన్ని బిజెపి అమలు చేస్తోందన్నారు. మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బిజెపి చిచ్చుపెడుతుందని ఆరోపించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వ్యాపార ముసుగులో బ్రిటీషర్స్ దేశంలో అడుగుపెట్టింది గుజరాత్‌లోని సూరత్‌లోనే అన్నారు. బ్రిటీష్ దొరలను దేశం నుండి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. గాంధీ, నెహ్రు, పటేల్ దేశ నిర్మాణానికి పునాదులు వేశారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పునాదులతోనే ఈనదియా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందనన్నారు. సర్దార్ పటేల్‌కు బిజెపికి ఏమిటి సంబంధమో అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించింది సర్దార్ పటేల్ అన్నారు. గాంధీ భవన్ నిర్మాణానికి పునాదులు వేసింది సర్దార్ పటేల్ అని గుర్తు చేశారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ సహజ వనరులను కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్ నుండి అదానీ కంపెనీ బయలుదేరిందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు.

ఎఐసిసి ఆదేశిస్తే రాజీనామాలు
రాహుల్ గాంధీపై బిజెపి ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రాహుల్ గాంధీ గొంతును అణచివేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని బిజెపి, మోడీ చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి కుట్రలను తిప్పి కొడతామన్నారు. రాహుల్‌గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక కుట్రపూరితంగా వేటు వేశారని ఆరోపించారు. దేశ స్వాతంత్య్రం కోసం రాహుల్ గాంధీ తాత నెహ్రూ జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టాల్సిన ఆందోళనపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ ఎంపిలు రాజీనామా చేయాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయంలో ఎఐసిసి నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. అధిష్ఠానం ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తామన్నారు.

అదానీ వ్యవహరాన్ని డైవర్ట్ చేసేందుకే ..: ఎంపి కోమటిరెడ్డి
రాహుల్ గాంధీ అనర్హత అప్రజాస్వామికం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను నిరసిస్తూ… గాంధీ భవన్ లో చేపట్టిన సంకల్ప్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ప్రకటించారు. అదానీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. అవసరం అయితే ఎంపిలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్నారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉందని వివరించారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ వదులుకున్నారని గుర్తు చేశారు. అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో అప్పటి నుంచి కుట్ర చేశారని తెలిపారు. ఆగమేఘాల మీద పరువు నష్టం కేసులో శిక్ష పడేలా చేశారన్నారు. అయితే ఇందిరాగాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు.

రాహుల్ సస్పెండే దానికి ఉదాహరణ: జగ్గారెడ్డి
ప్రధాని మోడీకి గాంధీ కుటుంబంపై ఎంత కక్ష పెంచుకున్నారో చెప్పడానికి రాహుల్ గాంధీ సస్పెండ్ ఉదాహరణ అని కాంగ్రెస్ సీనియర్ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో రాహుల్ ఉండోద్దనే కుట్రతోనే అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని గంటల వ్యవధిలో పార్లమెంట్‌లో రాహుల్ ఉండకుండా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఇంతకంటే నీచం మరొకటి లేదన్నారు. రాహుల్ గాంధీకి ఎంపి పదవి లేకపోయినా పెద్ద సమస్య కాదన్నారు. పదవి ఉన్నా, లేకున్నా ఆయన మాటకు, ఆ కుటుంబానికి విలువ ఉందన్నారు. అద్వానీ ప్రధాని కాకుండా కుట్రలతో మోడీ ప్రధాని అయ్యారని ఆరోపించారు. అలాంటి మోదీకి, రాహుల్ కుటుంబానికి చాలా తేడా ఉందన్నారు.

ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా వదిలేసి మన్మోహన్ సింగ్‌ను ప్రధాని చేసిన కుటుంబం రాహుల్‌దన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చూసి బిజెపి మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సేని పోగిడినప్పుడే విలువ పోయిందన్నారు. కేంద్రంలోని బిజెపిది క్రిమినల్ ప్రభుత్వమని విమర్శించారు. రాహుల్‌ను ఎందుకు సస్పెండ్ చేశామా? అని బిజెపి ఇప్పుడు ఫీల్ అయ్యే ఉంటుందన్నారు. ఆదాని స్కాంతో బిజెపిలో కొట్లాటలు జరుగుతున్నాయని, దాని మీద చర్చ జరగకుండా బిజెపి చేసిన రాజకీయ కుట్రనే రాహుల్‌పై చర్య అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News