గోదావరిఖని: తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధించిన ముమ్మాటికీ సింగరేణి కార్మికులదేనని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరిఖనిలోని జవహార్ లాల్ నెహ్రు స్టేడియంలో శనివారం జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి బొగ్గు కార్మికుల కష్టం అనిర్వచనీయమైనదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రసాధనలో బొగ్గు గని కార్మికుల సహకారం ఎనలేనిదని తెలిపారు. ఉద్యోగాలు పోతాయని బెదిరించినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుకు సాగించి, తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోసించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ సింగరేణి కార్మికులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని, సొంత ఇళ్లు కట్టిస్తామని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా నీటిమీద రాతలుగా మార్చారని అన్నారు.
నాలుగు లక్షల మందికి పైగా నివసించే సింగరేణి జనాభా ప్రస్తుతం రెండు లక్షలకు పడిపోయిందని అన్నారు. మిగిలిన రెండు లక్షల మంది పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం వలసలు వెళ్లారన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగులు ఉండవని చెప్పిన కెసిఆర్ ఆ మాటలను మరిచిపోయారని, ఓసిపిలతో రామగుండంను బొందలగడ్డగా మార్చారని అన్నారు. ఈ మైనింగుల ద్వారా కాలుష్యం పెరిగి క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడి ప్రజలు చనిపోతున్నారని, అందుకే తాము అధికారంలోకి వచ్చాక ఓపెన్ కాస్ట్ మైనింగ్స్‌ను రద్దు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొగ్గు మొదలు ఇసుక వరకూ అన్నీ దోపిడీ చేయడమే కాకుండా, నిరుద్యోగులను సైతం మోసం చేసి కోట్లు కూడగట్టారని ఆరోపించారు. సానుభూతితో గెలిపిస్తే సర్వం దోచుకున్నాడని, మళ్లీ అవకాశమిస్తే మరింత దోచుకుంటాడని, ప్రజలు ఈసారి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. గతంలో సింగరేణికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.
ప్రస్తుతం రామగుండంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మూతపడ్డాయని, తాము అధికారంలోకి వస్తే తిరిగి తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సభలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి, నా యకులు హర్కార వేణుగోపాల్ రావు, రామగుండం అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, జనక్‌ప్రసాద్, బొంతల రాజేష్, మహాంకాళి స్వామి, పెద్దెల్లి తేజశ్వి ప్రకాష్, పాతపల్లి ఎల్లయ్య, టి.యుగేంధర్, గంట సత్యనారాయణ రెడ్డి, గట్ల రమేష్, సనా ఫక్రుద్దీన్ తదితరులున్నారు.