ఐఎస్‌బీలో ఉన్న వారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను 600 మిలియన్ సిటీగా మార్చేందుకు మీ అందరి సహకారం కావాలని సిఎం అన్నారు. ఆదివారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో నిర్వహించిన లీడర్‌షిప్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
“తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చను. న్యూయార్క్, లండన్, పారిస్‌తో పోల్చాలనుకుంటాను. మీరంతా తెలంగాణలో 2, 3 ఏళ్లు పనిచేయాలి. జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని, త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేం. మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలి. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతోమంది నాయకులు మనందరికీ ఆదర్శం. నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నాను. నాయకులు డబ్బు, సమయం, వ్యక్తిగత జీవితం.. ఇలా అన్నీ త్యాగం చేయాలి. సిగ్గుపడకుండా ప్రజలతో మమేకమవ్వాలి” అని సిఎం రేవంత్ చెప్పారు.