హైదరాబాద్: ఎంతో మంది త్యాగధనుల పోరాట ఫలితమే నేటి మన స్వతంత్ర భారత దేశమని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్ లో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలకు 75వ స్వాతంత్ర విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ దేశాన్ని తామే పాలించుకోవాలని దేశ ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిందన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నటికీ మరువలేమన్నారు. విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు శాంతి యుతంగా నిర్వహించామని, మహాత్మాగాంధీ శాంతి యుత ఉద్యమాలు చేసి ప్రపంచంలో ఆదర్శగా నిలించాయని, కొన్ని శక్తులు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని ప్రయోగశాలగా మార్చాయని దుయ్యబట్టారు.
దేశంలో పల్లెల్లో అభివృద్ధి ఫలాలు రావాలని కాంగ్రెస్ నిర్ణయించిందని, ప్రతి వస్తువు ఉత్పత్తి దారులు మాత్రమే ధర నిర్ణయిస్తుంటే ఒక్క రైతు మాత్రమే తాను పండించిన పంటలు వ్యాపారి నిర్ణయించడంతో రైతులు మోసపోతున్నారన్నారు. రైతులకు ఉచిత కరెంట్ భూమి, మద్దతు ధరలు అన్ని ఇచ్చి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ అని తెలిపారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి రైతుల వెన్నుముక విరిచిందని మండిపడ్డారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నెలల తరబడి పోరాటాలు చేస్తున్నాయని, దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాథమిక విద్య నుంచి వైద్య విద్య వరకు అన్ని రకాల విద్య సౌకర్యాలను కల్పించి బడుగు, బలహీన వర్గాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందన్నారు. బిజెపి దేశంలో మతాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తుందని రేవంత్ మండిపడ్డారు. దేశాన్ని ఏకతాటిపై ఉంచి అఖండ భారత్ గా నిలిచేలా కాంగ్రెస్ కృషి చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ ఆశయాలను అమలు చేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనా విధానాలతో పనిచేసి దేశంలో బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు.