మీ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చి మీ కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా తాపత్రయం
పరిశ్రమలు మన దగ్గర లేకపోవడం వల్లే మన ప్రాంత ప్రజలు వలసలు వెళుతున్నారు
వచ్చే ఐదేళ్లలో మరో రూ. పదివేల కోట్లతో కొడంగల్‌ను అద్దంలా తీర్చిదిద్దుతా
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా సన్నాహక సమావేశంలో
సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు అక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని పరిశ్రమలు మన దగ్గర లేకపోవడం వల్లే మన ప్రాంత ప్రజలు వలసలు వెళుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక్కడకు పరిశ్రమలు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మీ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చి మీ కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా తాపత్రయమని ఆయన తెలిపారు. కొడంగల్‌లోని సిఎం రేవంత్ నివాసంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో మరో పదివేల కోట్ల రూపాయలతో కొడంగల్‌ను అద్దంలా తీర్చిదిద్దాలన్నది తన కోరిక అని, మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదని, నాయకుడిగా మీ ప్రేమ నాకు చాలని, డీజిల్‌కు పైసలు వసూలు చేసినవాళ్లు ఇవాళ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే అందరం మునుగిపోతామని కొడంగల్ భూముల విలువ ఎకరానికి కోటి పెరగాలంటే ఇక్కడ అభివృద్ధి జరగాలని, అభివృద్ధికి అడ్డుపడి ఆపాలని చూసే ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వదలరని సిఎం రేవంత్ అన్నారు.
కొడంగల్‌కు కంచె వేసుకొని కాపాడుకునే బాధ్యత కార్యకర్తలది
అసెంబ్లీకి వస్తే వినాల్సి వస్తుందని, వింటే పడాల్సి వస్తుందని కెసిఆర్ రావడం లేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు ఓనమాలు కూడా రాదని, చెప్పినా నేర్చుకోరని ఆయన ఎద్దేవా చేశారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగల్‌కు పోయిం దని, అందుకే వాళ్లకు దుఃఖమని, అందుకే కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తాను తీసుకుంటానని సిఎం రేవంత్ అన్నారు. కొడంగల్‌కు కంచె వేసుకొని కాపాడుకునే బాధ్యత తమ కార్యకర్తలు తీసుకుంటారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్‌కే ఉంటుందని, పదేళ్లలో కొడంగల్ ను గొప్పగా అభివృద్ధి చేసుకుందామని ఆయన తెలిపారు. ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని, భూసేకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా వ్యాఖ్యలు
కేంద్రహోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించేలా మాట్లాడారని, మహాత్మాగాంధీని చంపిన వారిని ప్రోత్సహించేలా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్లే దేశంలో సామాజిక పరి వర్తన జరిగిందని, ప్రజలు కనిపించని దేవుడిగా అంబేద్కర్‌ను కొలుస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని ఆయన్ను ఆరాధిస్తున్నారన్నారు. అలాంటి మహానీయుడిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతి చోట సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నామన్నారు. ముఖ్యమంత్రిగా తనకు ఈ బలం, ఈ శక్తి మీరిచ్చిందేనని ఆయన తెలిపారు. కొడంగల్ నివాసంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా సన్నాహక సమావేశం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ ముఖ్యనాయకులు.
చిట్టీ రాసిస్తే చాలు నేను కొడంగల్‌కు వచ్చి అన్నీ పూర్తి చేయిస్తా…
అంతకుముందు కొడంగల్‌లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కొడంగల్ ప్రజలు తనకు తెలంగాణను పరిపాలించే శక్తినిచ్చారన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చని, వాళ్లను పట్టించుకోవద్దని, తానేం చేస్తానో, ఏం చేయనో మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదటగా లేవనెత్తింది తానేనని, ఆనాటి నుంచి ఇప్పటివరకు ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. కొడంగల్‌లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25 శాతం మంజూరుచేశామని ఆయన తెలిపారు. ఒక్క సంతకంతో కొడంగల్ కు అన్నీ వస్తాయని, మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదని, చిట్టీ రాసిస్తే చాలు నేను కొడంగల్‌కు వచ్చి అన్నీ పూర్తి చేయిస్తానని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు.