Monday, December 23, 2024

ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యం: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్: ఇందిరమ్మ రాజ్య స్థాపన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇందుకు అన్నివర్గాల ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు తెలుపాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హాత్ సే హాత్ జోడోయాత్రలో భాగంగా ఎంజిఎం జంక్షన్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం వరంగల్ హెడ్‌పోస్టాఫీసు వద్ద జరిగిన సభలో ఆయన ప్రసంగించారు వరంగల్ జిల్లా చారిత్రాత్మక నగరమని, కాకతీయ సామ్రాజ్యం ఎంతో గొప్పదని, ఈనగరంలో కాజీపేట దర్గా, ఖిలావరంగల్, సమ్మక్క-సారలమ్మ, రామప్ప, వేయిస్తంభాల గుడి, శ్రీభద్రకాళి దేవస్థానం ఎంతో గొప్పవని అన్నారు. దేశ నిర్మాణంలో పునాదిరాయిగా ఉన్న హైదరాబాద్ తరువాత వరంగల్ ఎంతో చరిత్ర కలిగి ఉందన్నారు. మాజీ ప్రధాని పివి నర్సింహరావు ఇక్కడి నుండి గెలిచి ఎన్నో సంస్మరణలు చేపట్టారన్నారు.

అనంతరం 2014 తరువాత వరంగల్‌కు గ్రహణం పట్టిందన్నారు. విద్యకు వరంగల్ జిల్లా పెట్టింది పేరని, ఆర్‌ఈసి ఎంతో మంది ఇంజనీర్లను ఇచ్చిందని, మైనార్టీ సోదరులు ఇక్కడ మెజార్టీలో ఉన్నారని, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. తమ ప్రభుత్వం వస్తే దళితులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తన హయాంలోనే వరంగల్ తూర్పు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

ఇందిరమ్మ పాలన రేవంత్‌రెడ్డితోనే సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. దాడులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదని ప్రజలే తమ ప్రాణమని, ఇందుకు దుష్టపాలనను అంతం చేసి రేవంత్‌ను సిఎంగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి అంజన్‌కుమార్‌యాదవ్, ములుగు ఎంఎల్‌ఎ సీతక్క, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావు, సుస్మితపటేల్‌తో పాటు రాష్ట్ర, జిల్లా ముఖ్యనాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News