తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉందా? బిఆర్‌ఎస్ ఉందా? అనే అనుమానాలు వచ్చే విధంగా బిఆర్‌ఎస్ వ్యవహరిస్తున్నది. తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా పల్టా అయినట్టు ప్రచారం చేస్తున్నారు. ఇక మీరు రంగంలోకి దిగక తప్పదు అని బిఆర్‌ఎస్ సీనియర్లు కెసిఆర్‌ను కోరుతున్నారు. ఇదేం సర్కార్, ఇదేం పాలన! మళ్ళీ కెసిఆర్ పాలన వస్తే మంచిగుండు! కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాట… అంటూ బిఆర్‌ఎస్ చెలరేగుతోంది.
కెసిఆర్ పాలన మళ్ళీ రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎందుకు కోరుకుంటారో? అందులో లాజిక్కు ఏమిటో మనకు అర్ధం కాదు. కెసిఆర్ ఫార్మ్ హౌజ్‌కే పరిమితమైండు. సెక్రెటేరియట్‌కు రావడం లేదనే విమర్శలు వచ్చినా పదేళ్ల పాటు పనులన్నీ వేటికవే జరిగిపోతూ ఉండేవి అని మరో ప్రచారం మొదలైంది. అంటే కెసిఆర్ ఫార్మ్ హౌజ్ నుంచి పరిపాలించడాన్ని సమర్ధించుకుంటున్నట్టు భావించాలి. ఇక తెలంగాణ తరహా మరో ఉద్యమానికి కార్యాచరణకు కెసిఆర్ పదునుపెడుతున్నారు అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల భావన.
తెలంగాణ రాష్ట్ర సాకార ఉద్యమం వెనుక ఆరు దశాబ్దాలకు పైగా ప్రజల్లో ఒక సెంటిమెంటు ఉన్నది. భావోద్వేగాలున్నవి. ఆ ఎమోషన్స్‌తో సకల వర్గాలు కనెక్టు అయ్యారు. కెసిఆర్‌ను సొంతం చేసుకున్నారు. అది గడచినకాలం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తరహా ఉద్యమం అంటే ఎలా చేస్తారు? దానికి ప్రాతిపదిక ఏమిటి? కెసిఆర్ పాలన రావడం కోసమేనా? కెసిఆర్ పాలన ఎవరు కోరుకుంటున్నారు? భూస్వాములు, సంపన్నులు, కమ్మ, వెలమ సామాజిక వర్గాలు, పదేళ్ళపాటు ప్రకృతి వనరులను కొల్లగొట్టినవారు కాంక్షిస్తున్నారేమో! హైదరాబాద్ నగరాన్ని, దాని చుట్టు పక్కల ప్రాంతాలను ‘కబళించిన’ వర్గాలకు, వ్యక్తులకు, మరీ ముఖ్యంగా కోస్తా ఆంధ్ర నుంచి వలస వచ్చి స్థిరపడి ‘ఆనకొండ’లా చుట్టుముట్టిన వారికి కెసిఆర్ అంటే ప్రేమ.
కెటిఆర్ అంటే మమకారం. బహుశా మరో తెలంగాణ ఉద్యమానికి ఆయా వర్గాలే ఇంధనం సమకూర్చవచ్చు. ఇలాంటి నకిలీ, మకిలి ఉద్యమాలకు ప్రజల మద్దతు ఉండదు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఆరు రెస్క్యూ హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లను ఉపయోగిస్తోంది. మన తెలంగాణ సిఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లను ఉపయోగించి ఎంతమంది ప్రాణాలు కాపాడగలిగారో ఊహించండి? పెద్ద సున్నా! ఎలాంటి ముందు జాగ్రత్తలు లేవు. స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు. రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు. ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి ఈ రాష్ట్రానికి సిఎం లేనట్టు పక్క రాష్ట్రం సిఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు.
జరగాల్సిన నష్టమంతా జరిగాక. పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీఫ్ మినిస్టర్. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు అని కెటిఆర్ అమెరికా నుంచి ‘ఎక్స్’ వేదికగా విమర్శలు సంధించారు. వరద సహాయక చర్యలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు బృందం ఖమ్మం పర్యటనలో తేల్చిపారేశారు.
రెండు మూడు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయాలని మైండ్ గేమ్ ఆడటానికి బిఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించుకున్నట్టు సులభంగా అర్ధం చేసుకోవచ్చు. 1. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో విఫలమయ్యారు. 2. కెసిఆర్ మరలా అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్ర పరిస్థితి గాడిలో పడదు. ఈ రెండు విషయాలను ప్రజల మనస్సులో బలంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తీసుకురావడానికి బిఆర్‌ఎస్ నాయకత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అయితే 2029 దాకా ప్రభుత్వం మారదన్న సత్యం తెలిసి కూడా ఈ ప్రేలాపనలు ఏమిటో తెలియదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల కృత్రిమ వ్యతిరేకతను సృష్టించలేరు. ఎన్ని గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యల్లో ఆరితేరిన కెసిఆర్ అయినా ఈ ప్రయోగంలో విఫలంకావడం తథ్యం.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును పొగిడి, రేవంత్ రెడ్డిని తెగడటంలోనే కెటిఆర్ ‘మానసిక స్థితి’ని అంచనా వేయవచ్చు. సొంత రాష్ట్రం ముఖ్యమంత్రి పగవాడైనా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి విపత్తు వేళ నైతిక మద్దతు ఇవ్వడం మరచిపోయి, ఎపి సిఎం చంద్రబాబు పనితీరును ‘యువరాజు’ ప్రశంసిస్తున్నారంటేనే ఆ ‘సామాజిక వర్గం’పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు కనిపిస్తున్నవి. ఆ సామాజిక వర్గంతో ఉన్న వ్యాపార, పారిశ్రామిక అనుబంధం కూడా బయటపడుతున్నది. ఎపిలో వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు ‘వన్ మ్యాన్ షో’ కనిపిస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, సీతక్క, జూపల్లి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి తదితరులంతా వరద బాధితుల సహాయ చర్యల్లో భాగంగా ‘గ్రౌండ్’లోనే ఉన్న సంగతి కెటిఆర్‌కు కనిపించడం లేదా?
కాగా తెలంగాణ జలప్రళయంతో విలవిల్లాడుతుంటే ప్రతిపక్షం బిఆర్‌ఎస్ నాయకత్వం ‘ఎర్రవల్లి కోట’లో కుటిల పన్నాగాలు పన్నుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ఠ పాల్జేయడం ఆ పన్నాగాల ఎజెండా! కాంగ్రెస్ ప్రభుత్వం ‘విపత్కర’ పరిస్థితులను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నదని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఎడమచేత్తో ‘సంక్షోభాల’ను పరిష్కరించేవారని, యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ ప్రాణాలను ‘సూపర్ మ్యాన్’లా దూసుకువెళ్లి వాగులో కొట్టుకుపోతుంటే కాపాడేవారని ప్రచారం చేయడానికి బిఆర్‌ఎస్ కార్యకర్తలు, కెటిఆర్ ‘భజన బ్యాచ్’ వెనుకాడటం లేదు. ఎర్రవల్లి కోట నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాలకు బిఆర్‌ఎస్ ‘సైనిక బలగాల’ను మోహరింపజేస్తున్నారు.
కెసిఆర్ హయాంలో తెలంగాణ ప్రజలు ‘స్వర్ణయుగం’ చూశారని, ఇప్పుడు నరకం చూస్తున్నట్టు బిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. దశాబ్దాలుగా చీకటిలో మగ్గిన తెలంగాణకు కెసిఆర్ ముందుచూపుతోనే ‘కరెంటు వెలుగు’ వచ్చిందనీ చెబుతున్నారు. సరే, ఈ ప్రచారమే నిజమని అనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2014లో ఒక లక్షా పదహారు వేల కోట్ల మిగులు నిధులుండేవి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి తెలంగాణ రాష్ట్రం రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో ఎట్లా కూరుకుపోయింది? కారకులెవరు? ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడం, ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, రాచరికపు పోకడలు, మూర్ఖపు చర్యలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అని నేను ఆనాడే చెప్పాను. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. తెలంగాణ ఆర్ధికంగా కుంగిపోవడానికి పాలకుల స్వయంకృతాపరాధం కారణం అని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అయితే జెపి అదే ఇంటర్వ్యూలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ‘సంక్షేమం అభివృద్ధి’ మధ్య బ్యాలెన్సు చేయడానికి ప్రయత్నించినట్టు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలు, రుణమాఫీ కార్యక్రమాలపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రెండు విపత్తులతో పోరాడుతున్నారు. ఇటు ప్రకృతి వలన సంభవించిన విపత్తు, మరొకటి ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ నుంచి ఎదురవుతున్న విమర్శల ‘విపత్తు’తోనూ ఏకకాలంలో సిఎం పోరాడవలసి వస్తున్నది.
‘కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ అసమర్ధత వల్ల వచ్చిన కరువు’ అంటూ గత మార్చిలో కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి వంటి నాయకులంతా దాడి చేశారు. ఇంచుమించు అదే స్వరంతో ‘వరద సహాయక చర్యల’ గురించి కూడా పెద్దయెత్తున బిఆర్‌ఎస్ నాయకత్వం విరుచుకుపడుతోంది. తెలంగాణలో సంభవించిన విపత్తు వేళ… కమ్మ సామాజికవర్గం, సినీ పరిశ్రమ, బిఆర్‌ఎస్ మధ్య అనుబంధం బయటపడుతోంది. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో దశాబ్దాల కిందటే వేళ్ళూనుకున్నప్పటికీ, ఆ పరిశ్రమను శాసించే సామాజిక వర్గం ‘మనసంతా ఆంధ్రప్రదేశ్ వైపే’! వాళ్లెప్పుడూ తెలంగాణను సొంతం చేసుకోలేరు. తెలంగాణవారిగానూ చెప్పుకోరు. తమ మూలాలు ఎపిలోనే ఉన్నందున తమ విరాళాలు కూడా ఎక్కువగా ఎపికి అందజేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. కొందరు మాత్రం రెండు రాష్ట్రాలకూ అందేలా విభజించి విరాళాలు అందిస్తున్నారు.
ఎస్ కె జకీర్