Sunday, January 19, 2025

జడ్పిటిసి నుంచి సిఎం పీఠానికి..

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రిగా నాగర్‌కర్నూల్ మట్టిబిడ్డ
రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు
2వసారి దక్కిన ముఖ్యమంత్రి పదవి
నాడు బూర్గుల…నేడు ఎనుముల
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి
జన్మస్థానం రేపు సిఎంగా ప్రమాణం
మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: తెలంగాణ రా ష్ట్ర ముఖ్యమంత్రిగా నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రైతు కుటుంబం నుంచి జన్మించిన మట్టి బిడ్డకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జి ల్లాకు చెందిన రెండవ వ్యక్తి సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. స్వాతంత్రం అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1952లో షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు నియమితులయ్యారు. అనంతరం 72 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డికి సిఎం అవకాశం దక్కింది.

కుటుంబ నేపథ్యం
ఎనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామం లో జన్మించారు. ఆయన సతీమణి గీత, తండ్రి ఎనుముల నర్సింహా రెడ్డి, తల్లి ఎనుముల రామచంద్రమ్మ. రేవంత్ తల్లిదండ్రులకు ఏడుగురు మగ సంతానం, ఒక కుమార్తె ఉన్నారు. రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి, ఎంపి సూదిని జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతను ప్రేమించి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గీత దంపతులకు కుమార్తె నహీనిషా ఉన్నారు. రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో సొంత ఇల్లు ఉంది. ఇప్పటికి రేవంత్ రెడ్డి పండుగలకు, గ్రామంలో జరిగే కార్యాలకు వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు.

విద్యాభ్యాసం
రేవంత్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొండారెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివారు. 6, 7 తరగతులు కల్వకుర్తి మం డలం తాండ్ర గ్రామంలోని జెడ్పిహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో చదివారు. 8నుంచి 10వ తరగతి వరకు వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. వనపర్తిలోని తన సోదరులు ఎనుముల భూపాల్ రెడ్డి నివాసంలో ఉంటూ ఇంటర్మీడియట్‌ను పూర్తి చేశారు. డిగ్రీ విద్యాభ్యాసాన్ని హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటి ద్వారా ఫైన్ ఆర్ట్ సబ్జెక్టు పూర్తి చేశారు. డిగ్రీ అనంతరం హిమాయత్‌నగర్‌లోని ప్రింటింగ్ ప్రెస్ సొంతంగా ఏర్పాటు చేసి నిర్వహించారు. జూబ్లిహిల్స్ క్లబ్ సెక్రటరిగా రేవంత్ సొసైటి ఎన్నికల్లో గెలుపొందారు. అంతకు ముందు జాగృతి అనే దినపత్రికలో పాత్రికేయుడిగా సైతం పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం
రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. మొట్టమొటటి సారిగా మిడ్జిల్ మండల జెడ్పిటిసిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్, టిడిపి, బిఆర్‌ఎస్, బిజెపి వంటి పార్టీలను ఎదుర్కొని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుండి 2007లో జెడ్పిటిసి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ గెలుపు పార్టీలన్ని ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేలా చేశాయి. అక్కడే ఆయన నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి.

తర్వాత ఎమ్మెల్సీగా గెలవడంతో అప్పటికే అధికారంలో కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావాలని ఆహ్వానించినా దివంగత సిఎం ఎన్‌టిఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న అభిమానంతో టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ విజయం ఆయన చరిష్మాను మరింతగా పెంచింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున మరోసారి బరిలో దిగిన ఆయన ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవారు. రేవంత్ 2014 నుంచి 2017 మధ్య టిడిఎల్‌పి ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు.

2017 అక్టోబర్‌లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 3 ఏళ్ల అనాధికాలంలోనే ఎవ్వరికి దక్కని హోదాతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. 2018లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో పోటీ చేసి ఓడిపోయారు. 2019మే లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపిగా గెలిచారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 26 జూన్ 2021లో కాంగ్రెస్ పార్టీ నియమించింంది.

రేవంత్ రెడ్డి 2021 జులై 7న అప్పటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టిపిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేంగా పోరాడుతూనే ఉన్నారు. 2023 సార్వత్రిక ఎన్నికలలో తన లక్షాన్ని చేరుకున్నారు. కెసిఆర్‌ని ఓడించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగారు. ఉనికే ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయన కీలక భూమిక పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో హర్షాతిరేకాలు
నాగర్‌కర్నూల్ జిల్లా వాసి ముఖ్యమంత్రి కాబోతుండడంతో జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మన ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల జిల్లా మరింతగా అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే నీటి వనరులు సమృద్ధిగా ఉన్న జిల్లా కావడం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉండడం ఇవన్ని పూర్తైతే జిల్లా మ రింతగా అభివృద్ధి చెందుతుందన్న ఆశ సర్వత్రా వ్యక్తమవుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడి అభివృద్ది బాట లో పయనిస్తూ అడవులు, వ్యవసాయ యోగ్యమైన భూ ములు, పరిశ్రమలకు అనువైన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల అభివృద్ధికి బాటలు పడుతాయని ఆశతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News