Saturday, November 9, 2024

డిసెంబర్ 9నుంచి రేవంత్ పాదయాత్ర..!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఆయన తెలంగాణ మొత్తం చుట్టేలా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ కూడా అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ వంటి అంశాలపై కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఖచ్చితంగా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆరు నెలల్లో తెలంగాణ మొత్తం పాదయాత్ర పూర్తి చేసి ఆ తర్వాత ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. దాదాపుగా రెండు వారాల పాటు సాగిన పాదయాత్రలో మంచి జోష్ వచ్చిందని.. రాహుల్ గాంధీపై చాలా పాజిటివ్ అభిప్రాయం ఏర్పడిందని, దాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు తెలంగాణ నేతలు పని చేయాల్సి ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. ఈ ప్రకారం రేవంత్ రెడ్డి తన పాదయాత్ర ప్రణాళికల్ని రాహుల్ ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు. పాదయాత్రతో పాటు మునుగోడు ఉపఎన్నికలనూ ఒంటి చేత్తో రేవంత్ సమన్వయం చేశారు. రేవంత్ పనితీరు రాహుల్ గాంధీకి బాగా నచ్చడంతో పాదయాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎప్పట్నుంచో చేస్తున్నారు. పిసిసి చీఫ్ పదవి దక్కిన తర్వాత మొదట అదే పని చేద్దామనుకున్నారు.

కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాల వల్ల సాధ్యం కాలేదు. ఓ సారి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకూ చేసిన పాదయాత్రపై అనేక ఫిర్యాదు హైకమాండ్‌కు వెళ్లాయి. అదే సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను కూడా పాదయాత్ర చేస్తానని హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఆయన పై పార్టీ హైకమాండ్ కూడా నమ్మకం కోల్పోయింది. దీంతో రేవంత్‌కు లైన్ క్లియర్ అయినట్లయింది.

అంతర్గత రాజకీయాలు సహకరిస్తాయా?
పార్టీలో మరో సీనియర్ నేత సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. గతంలో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేశారు. హైకమాండ్ అనుమతి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా రేసులోకి తేవచ్చని భావిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరిన బలమైన అభ్యర్థులు ఉన్న చోటనే బిజెపి గట్టి పోటీ ఇస్తోంది. మిగిలిన చోట్ల కాంగ్రెస్ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించగల మని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా అది జరుగుతుందని ఆశిస్తున్నారు.

Revanth Reddy to start Padayatra from Dec 9

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News