Sunday, January 19, 2025

నేడే ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా ఎనుముల రేవంత్‌రెడ్డి, ఇతర కేబినేట్ మంత్రులు గురువా రం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా ఆరుగురు గానీ, తొమ్మిది మంది గానీ కేబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అ వకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయవచ్చునని తెలిసింది. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్‌ల నాయకత్వం లో రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యాలయం కార్యదర్శి సురేంద్ర మోహన్‌ను కలిసి లేఖను అందజేశారు. ఈ లేఖతో పాటు సిఎల్‌పి నేతగా రేవంత్‌రెడ్డి ఎన్నుకున్నామని కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై గెలిచిన 64మంది ఎంఎల్‌ఎల సంతకాలతో కూడిన లేఖను కూడా అందజేశారు. 64మంది ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారని, మరో ఎమ్మెల్యే సిపిఐ పార్టీ నుంచి గెలుపొందారని, మొత్తం 65 మంది ఎమ్మెల్యేల మద్దతు తమ పార్టీకి ఉందని, అందుచేతనే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశమివ్వాలని, అందుకు తగినట్లుగా సిఎల్‌పి నాయకుడిగా ఎన్నికైన రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గవర్నర్ కార్యదర్శిని కోరారు.

అందుకు తగినట్లుగా స్పందించిన గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొన్నారని, ఎల్‌బి స్టే డియంలో రాష్ట్ర ప్రజలు, అమర వీరుల కుటుంబాలు, ఉద్యమ నాయకులు, రాజకీయ ప్రముఖులు, జాతీయ నాయకుల సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా సిఎల్‌పి నేత రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఆ నా యకులు గవర్నర్ కార్యదర్శికి వివరించారు. దాంతో ప్రమాణ స్వీకారానికి తగిన ఏర్పాట్లు చేయాలని  తగినట్లుగా ఏర్పాట్లు చేసినట్లుగా చేశారు. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డిజిపి రవిగుప్త ఇతర సీనియర్ అధికారులు ఎల్‌బి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 01.04 గంటలకు శుభ ముహూర్తాన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌తో పాటుగా ముఖ్యమంత్రి అభ్యర్థ్ధి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులుగా ప్రమాణం చేయబోయే ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ, డిజిపిలు ఒక గేటు నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు వీలుగా కార్పెట్లను ఏర్పాటు చేశారు. ఎఐసిసి అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పిసిసి అధ్యక్షులు, విఐపిలు, మీడియా ప్రతినిధులు, ఉద్యమ నాయకులు, అమరుల కుటుంబ సభ్యులు, ఇతర పార్టీల నాయకులకు వేర్వేరుగా ఆసనాలను ఏర్పాటు చేశారు.

తమది ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు కూడా స్పష్టంచేసే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి అభ్యర్ధి రేవంత్‌రెడ్డి ప్రజలందరికీ బహిరంగ లేఖ రాశారని, అందుకే నగరానికి వచ్చే జనాభాను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లుగా పోలీస్‌శాఖ తెలిపింది. అంతేగాక భారీగా తరలివస్తున్న అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన విధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, ఇతర పారా మిలటరీ దళాలు కూడా భద్రతా విధుల్లో నియమించినట్లుగా అధికారులు తెలిపారు. కాగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం గురువారం (7వ తేదీన) ఉదయం 10.28 గంటలకు ఎల్‌బి స్టేడియంలోనే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఆ సమయంలో మార్పులు చేసి మధ్యాహ్నం 01.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే విధంగా ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ప్రమాణస్వీకారానికి అతిరథ మహారథులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని కనులారా తిలకించేందుకు రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోని అగ్రనాయకులు, ఎఐసిసి నేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కెసి వేణుగోపాల్, మాణిక్కరావు ఠాకూర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తదితరులు హాజరు కానున్నారు.

ప్రముఖులకు ఆహ్వానం
రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండగా ఇప్పటికే సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి)లోని కీలక వ్యక్తులతో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇక, కాంగ్రెస్ నేతలు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఎఐసిసి నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు కూడా ఆహ్వానం పంపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్, కర్ణాటక మంత్రులు, రాజస్థాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్ చౌహన్,

తమిళనాడు సిఎ స్టాలిన్, ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం పంపించారు. గతంలో ఇంఛార్టీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణికం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు. తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు అలాగే తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు, కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు కూడా ఆహ్వానం పంపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపారు.

ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్
ఎల్‌బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న దరిమిలా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు. బుధవారం సిఎస్ ఆధ్వర్యంలో ఎల్‌బి స్టేడియంలో సమీక్షా సమావేశం నే జరిగింది. ఈ సమావేశానికి డిజిపి రవిగుప్తా, అడిషనల్ డిజిలు సివి ఆనంద్, శివధర్ రెడ్డి, నగరపోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్యా, ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, రిజ్వి, జలమండలి ఎండి దాన కిషోర్, జిహెచ్‌ఎంసి కమీషనర్ రోనల్డ్ రోస్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, రాజ్ భవన్ కార్యదర్శి సురేంద్రమోహన్ , వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మున్సీ తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతి కుమారి ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని కోరారు. స్టేడియంలో మంచినీటితోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని, వారికి ప్రత్యేకంగా గ్యాలరీలతోపాటు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్, బందోబస్త్ లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకు ముందు ఎల్‌బి స్టేడియంలో జరుగుతున్న పనులను సిఎస్ పరిశీలించారు. డిజిపి రవి గుప్తా, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్గ్ రాస్ లతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. శానిటేషన్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News