మన తెలంగాణ/హైదరాబాద్/ములుగు: కుంభమేళా తరహాలో మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. శనివారం మేడారం సమ్మక్కసారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లాకు సమ్మక్కసారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రూ.200 కోట్లతో శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. మేడారం జాతరకు కేంద్రం కేటాయించిన రూ.2.5 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. బిజెపిలో గతంలో భిన్నాభిప్రాయాలకు చోటు ఉండేదని, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏక వ్యక్తి పార్టీగా మారిందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ కూడా అలాగే ఉందని విమర్శించారు. ఏక వ్యక్తి ఆలోచన ఎప్పటికైనా ప్రమాదమేనన్నారు.
కాంగ్రెస్‌ది భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని.. వాళ్లది ఏకత్వంలో మూర్ఖత్వం అని ఎద్దేవా చేశారు. ‘16, 17 తేదీల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో అధికార పార్టీ ఎంత దారుణంగా ప్రవర్తించిందో అంతా చూశారు. నన్ను అరెస్టు చేయడం, కార్యకర్తలపై కొట్టడంతో.. కోపం, ఆవేశంతో కొంత పరుషమైన పదజాలం వాడాను. అయితే పరుషమైన పదజాలం పోలీసు అధికారులపై వాడకుండా ఉండి ఉంటే బాగుండేదేమోనని అనిపించింది. భవిష్యత్తులో అలాంటి పరుష పదజాలం వాడటం వీలైనంత మేర తగ్గిస్తాం’ అని చెప్పారు.
Revanth Reddy visit Medaram Jatara