Monday, December 23, 2024

నిజామాబాద్ జిల్లా రైతులకి రుణపడి ఉంటా: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

భీమ్‌గల్: ఏఐసీసీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ సూచనలతో భారత్ జూడో యాత్ర కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హాత్ సే హత్ యాత్రలో భాగంగా భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆదివారం ఉదయం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు వారిని ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. స్వామి వారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా కమ్మర్‌పల్లి నుండి భీమ్‌గల్ మండలానికి ఆదివారం ఉదయం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కొరకై ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి దాదాపు 300 వందల బైకులతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీతో లింబాద్రి గుట్టకు చేరుకున్నారు. బైక్ ర్యాలీతో వెళ్లి మార్గమధ్యంలో పూరణిపేట్ గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం అక్కడ ఉన్న రైతులు, మహిళలతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముచ్చటించారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బాల్కొండ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు పొందని లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉన్నాయన్నారు. బాల్కొండ నియోజక వర్గ రైతులను బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు ఏప్పుడు పట్టించుకోలేదన్నారు. బిజెపికి చెందిన ఒకాయన ఐదు రోజులలో పసుపు బోర్తు తెస్తానని చెప్పి మాట తప్పారని రైతులకు పసుపు ఎర్రజొన్న, చెరుకు పంటలకు మద్దతు ధరలు లేవని మిగతా పంటలైన వరి, జొన్న, సోయా పంటల గురించి మాట్లాడి రైతులకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుందని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియామ్మకి మనమందరం రుణపడి ఉండాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల తెలంగాణలో కెసిఆర్ వల్ల కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ యువతకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి రూ. వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్ భూములు వచ్చాయని తెలంగాణ ప్రజలకు ఏమి రాలేదన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను వంత పాడుతూ రైతులకు నష్టం వాటిల్లే నల్ల చట్టాలతో రైతులను నిండా ముంచుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పేద ప్రజల కడుపు కొడుతూ అదానీ, అంబానీలకు దేశ సొత్తును మోడీ దోచి పెడుతున్నారని మండిపడ్డారు. హర్యానా, పంజాబ్ రైతుల్లాగా నిజామాబాద్ రైతులకు పోరాటం చేసే సత్తా ఉందని తెలిపారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయిండని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో చెరుకు పరిశ్రమ తెరుస్తామని చెప్పి మాట తప్పారన్నారు.

ఈ ప్రాంత రైతులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి పార్టీ నష్టపోయిన తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విఫ్ ఈరవత్రి అనిల్, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు బోదిరె స్వామి, పట్టణాధ్యక్షుడు జెజె నర్సయ్య, బాల్కొండ యువజన అధ్యక్షుడు నాగేంద్ర, మాజీ డిసిసి అధ్యక్షులు తాహెర్‌బిన్‌హందాన్, చరణ్, వాక, మహేష్, కత్రాజ్ శ్యామ్, నుచ్చామొల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News