మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ‘ఏం పీకటానికి మేడిగడ్డకు పోయావు?’ అని కేసీఆర్ మాట్లాడటం పద్ధతేనా అని ప్రశ్నించారు. బుధవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరుగుతున్న సందర్భంలో సిఎం రేవంత్ జోక్యం చేసుకుని మాట్లాడారు.
మేడిగడ్డలో నీళ్లు నింపి ఎత్తి పోయమని కేసీఆర్ అంటున్నారనీ, కానీ పిల్లర్లు కుంగిపోయిన ప్రాజెక్టులో నీళ్లు నింపే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. గతంలో నీటి పారుదల శాఖను చూసిన కేసీఆర్, హరీశ్ లకు మేడిగడ్డ ప్రాజెక్టు ఎత్తిపోతల బాధ్యతను అప్పగిస్తామని, వారు వచ్చి నీళ్లు ఎత్తిపోయాలని రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చకు తాము సిద్ధమని, కేసీఆర్ సభకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డపై కాంగ్రెసే తప్పు చేసినట్లు మాట్లాడటం భావ్యం కాదని, సానుభూతి కోసం కేసీఆర్ వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఆడుతున్నారని సిఎం ఎద్దేవా చేశారు.
నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ పారిపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నారనీ, సభకు వస్తే కాళేశ్వరం అవినీతి బయటపడుతుందని ఆయన భయమని రేవంత్ అన్నారు.
సిఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ కృష్ణ, గోదావరి జలాలపై శ్వేతపత్రం పెడితే చర్చలో పాల్గొనేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషపై తమకు అభ్యంతరం ఉందన్నారు. రేవంత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే బయట ఎన్నయినా మాట్లాడవచ్చనీ, కానీ ముఖ్యమంత్రి హోదాలో సభలో వాడరాని భాష వాడటం సబబు కాదని అన్నారు. శ్రీహరి మాటలతో సభలో గందరగోళం నెలకొంది. అధికార,ప్రతిపక్ష నాయకుల మధ్య అరుపులు కేకలు చోటు చేసుకున్నాయి.
కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చ చేద్దామా?: సిఎం రేవంత్ సవాల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -