వనపర్తి: గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు మాత్రమే నిధులు కేటాయించారని, వెనుకబడిన పాలుమూరును సిఎం కెసిఆర్ పట్టించుకోలేదని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలమూరు బిడ్డకు నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలని, ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందన్నారు. కెసిఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి కట్టింది కూడా కాంగ్రెస్సే అని దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లలో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, తొమ్మిదేళ్లలో కెసిఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్నారు.
కెసిఆర్ కుటుంబం కలలు మాత్రమే నెరవేరాయని, తెలంగాణ సాధనలో జి. చిన్నారెడ్డి కీలక పాత్ర పోషించారని, పాలమూరు జిల్లా ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయిలో ఉన్నామని, పదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి నీళ్ల నిరంజన్ కాదు అని కమీషన్ల నిరంజన్ అని, వందల ఎకరాల్లో నిరంజన్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కట్టించుకున్నారని రేవంత్ ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో ఏమీ లేదని చెప్పిన నిరంజన్‌కు వందల ఎకరాలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించాడు. కెసిఆర్ మంత్రి వర్గంలో అత్యంత అవినీతి పరుడు నిరంజన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. గుడి, బడి తేడా లేకుండానే భూమలన్నీ నిరంజన్ రెడ్డి మింగేశాడని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు.