వాతావరణంలో మార్పుల కారణంగా హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: వాతావరణంలో మార్పుల కారణంగా శుక్రవారం రేవంత్ ప్రయాణించే హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొనే సభలు ఆలస్యంగా మొదలయ్యాయి. హెలికాప్టర్ ప్రయాణం రద్దు కావడంతో రోడ్డు మార్గంలో టిపిసిసి అధ్యక్షుడు ఆయా నియోజకవర్గాలకు బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు రేవంత్ నకిరేకల్ సభలో, సాయంత్రం 6 గంటలకు తుంగతుర్తి సభలో, 8 గంటలకు ఆలేరు నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన సభల్లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.
అయితే శుక్రవారం కామారెడ్డిలో జరగాల్సిన సభలు నేటికి (శనివారం)కు వాయిదా పడినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం రేవంత్ శుక్రవారం నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు నకిరేకల్ బహిరంగసభ, మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి బహిరంగసభ, మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరు బహిరంగసభ, మధ్యాహ్నం 3:30 గంటలకు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్‌లో రేవంత్ పాల్గొనాల్సి ఉండగా హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు కావడంతో రోడ్డు మార్గాన బయలుదేరడంతో రేవంత్ సభలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి.