హైదరాబాద్: రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని అది నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ విద్య, వైద్యంపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సి ఉందని, విద్యుత్ కోతలు కొందరు కావాలనే చేస్తున్నట్టు ఉందని, రేపటి నుంచి తాను సచివాలయానికి వెళ్తానని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వెళ్తే విమర్శలు వస్తాయనే వెళ్లలేదని, అత్యవసర అంశాలపై నిర్ణయాలకు నియమావళి అడ్డురాదన్నారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశం లేదని, హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసిన తెలంగాణ ఆదాయం తగ్గదు అని రేవంత్ చెప్పారు. ఎపిలో ఎవరు సిఎం అయినా కలిసి పని చేస్తామని, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుంటామని, ఎవరితోనూ తెలంగాణ ప్రభుత్వానికి వైరం ఉండదని తేల్చి చెప్పారు. సుహృద్భావ వాతావరణంలో చర్చించి పరిష్కరించుకుంటామని, తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని రేవంత్ తెలిపారు.