- బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: ఉచిత విద్యుత్ అవసరం లేదన్న రేవంత్‌రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలకు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటల కరెంటు మాత్రమే రైతులు కోరుకుంటున్నారని టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై ఎమ్మెల్యే రేవంత్‌పై మండిపడ్డారు. తెలంగాణ రైతులు ఉచిత విద్యుత్ కోరుకోవడం లేదని అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలో రేవంత్‌రెడ్డి మాట్లాడడం సిగ్గు చేటని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యాలు తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే కరెంటు లేకుండాపోతుందని,రైతుబంధు, రైతుబీమా పథకాల ఊసులేకుండా చేస్తారని కొనుగోలు కేంద్రాలు మూత పడేస్తారని అన్నారు.
రేవంత్‌రెడ్డి మాటలకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో ఆందోళనలు నిర్వహించన్నుట్లు బిఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేఖ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.