Saturday, December 28, 2024

రేవంత్ నెల రోజుల పాలన: పార్టీలో లౌక్యం.. పాలనలో దూకుడు!

- Advertisement -
- Advertisement -

సూటిగా, ధాటిగా నెల రోజుల రేవంత్ పాలన!

హైదరాబాద్: జీన్స్‌పాంట్.. బ్రాండెడ్ షర్ట్. రేవంత్ రెడ్డి ఆహార్యం చాలా సింపుల్ గా ఉంటుంది. నడకలోనూ, నడతలోనూ కూడా చాలా సింపుల్‌గా ఉండే మనిషి. ఆర్భాటాలకూ,భేషజాలకూ దూరంగా ఉంటారు. ఇట్టే పదిమందిలోనూ కలిసిపోయే తత్వం ఆయనది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన పద్ధతిలో మా ర్పేమీ రాలేదు. మొదటి రోజు ప్రజాభవన్ లో జరిగిన ప్రజా దర్బారులో జనంతో కలసిపోయి,వారిసమస్యలు వింటూ, వారిని ఓదారుస్తూ, ధైర్యం చెబుతూ గడిపారు. యశోదా ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించడానికి వెళ్తుంటే, పక్కనుంచి ఎవరో మహిళ ‘అన్నా’ అని పిలవడంతో గిరుక్కున వెనక్కి తిరిగి, ఆమె వద్దకు వెళ్లారు. ఆమెకు ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. ఇది రేవంత్ సింప్లిసిటీకి ఓ ఉదాహరణ.

తాను కాన్వాయ్ లో వెళ్తున్నప్పుడు తన కో సం ట్రాఫిక్‌ను ఇబ్బంది పెట్టొద్దని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి అయిన రెండు, మూడు రోజుల్లోనే రేవంత్ తీసుకున్న నిర్ణయాలను చూస్తే ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసుననే అనిపిస్తుంది. తాను ప్రమాణస్వీకారం చేసే లోపలే పంతం కొద్దీ ప్రగతి భవన్‌కు ముందు ఉ న్న ఇనుప కంచెలను పగలగొట్టించి, దాన్ని ప్రజా భవన్‌గా ప్రకటించారు. ప్రగతి భవన్ ప్రజలకు దూరంగా ఉందనే విషయాన్ని ఆయన ఎన్నికల ప్రచార సభలలో పదే పదే చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, దాన్ని ప్రజాభవన్ గా మారుస్తామని కూడా ప్రకటించారు. అన్నట్టే సరిగ్గా తాను ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ప్రగతి భవన్‌కు ‘విముక్తి’ కల్పించారు. మరో మూడు రోజుల త ర్వాత ఆయన తీసుకున్న మరో నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరచింది. తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయిచుకున్న కేసీఆర్ ను రేవంత్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఒక సిఎంగా రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయవేత్తలు సైతం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతించారు.

గోరటి వెంకన్న వంటివారు కూడా ఇది సత్సంప్రదాయమంటూ ప్రశంసించడం గమనార్హం. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. అందుకనే రేవంత్ భేషజాలకు పోకుండా … కిషన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి, ప్రధాని మోడీని కలిసేందుకు సహకరించవలసిందిగా కోరారు. ఫార్మాసిటీ విషయంలోనూ పొరబాటు సరిదిద్దుకోవడంలో రేవంత్ ఏమాత్రం వెనుకాడలేదు. ఫార్మాసిటీని రద్దు చేసి, ఆ భూముల్లో మెగా టౌన్ షిప్పులు నిర్మిస్తామని రేవంత్ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ప్రకటించారు.

అయితే ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం వేలాది ఎకరాల భూ సేకరణ జరిపింది. కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇప్పటికే పరిశ్రమలు ప్రారంభించాయి. పైగా ఫార్మాసిటీని నమ్ముకుని అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. ఫార్మాసిటీ రద్దయితే, రియల్ ఎస్టేట్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుంది. దీనిని గ్రహించిన ముఖ్యమంత్రి.. ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని ఆ తర్వాత ప్రకటించారు. అవుటర్ రింగు రోడ్డు, రీజనల్ రింగు రోడ్డు మధ్య ఫార్మా సిటీని విడతల వారీగా జీరో కాలుష్యంతో క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. దాంతో మళ్లీ రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో తనవాళ్లంటూ ఎవరూ ఉండరనీ, తన అనుయాయులకు పదవులు ఇవ్వబోననీ తెగేసి చెప్పారు. దీనిద్వారా పదవుల భర్తీలో అర్హతలకే పెద్దపీట వేస్తామని చెప్పకనే చెప్పారు.

జీతాల చెల్లింపు గాడిన పెట్టే యత్నం
కొంతకాలంగా సకాలంలో జీతాలు అందక ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే జీతాల చెల్లింపును గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. జనవరి నెల ఒకటిన ఇవ్వవలసిన జీతాల చెల్లింపును నాలుగో తేదీనాటికి ముగించడం గమనార్హం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు కాస్త అటూ ఇటూగా మొదటి నెలలోనే ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని నెరవేర్చింది.

పార్టీపైనా పట్టు బిగుసుకుంటోంది!
పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డిపై అధిష్ఠానం ఎంతో నమ్మకంగా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ పగ్గాలను కూడా ఆయనకే అప్పజెప్పింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నవారే పిసిసి అధ్యక్షుడిగానూ వ్యవహరించిన దాఖలాలు లేవు. ఇప్పటివరకూ తెలుగునాట ఒక్క సందర్భంలోనే అలా జరిగింది. మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమం త్రి అయినప్పుడు కొంతకాలం ఆయన పిసిసి అధ్యక్షుడుగానూ వ్యవహరించారు. ఆ తర్వాత మళ్లీ ఆ ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది.

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడిన తరుణంలో పిసిసి అధ్యక్ష పదవిని మరొకరికి కట్టబెడితే లేనిపోని వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. పైగా అసెం బ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన రేవంత్, లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం చేకూరుస్తాడనే నమ్మకంతో పిసిసి అధ్యక్ష పదవినీ అధిష్ఠానం ఆయనకే అప్పగించింది. పార్టీపై కూడా రేవంత్ తనదైన శైలిలో పట్టు సాధిస్తున్నా రు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కప్పల తక్కెడ అనీ, అసమ్మతులకు కేరాఫ్ అడ్రస్ అనీ పేరు. రేవంత్ కి ఈ విషయం ఇంకాస్త ఎక్కువే తెలుసు. అందుకనే మొదటి రోజునుంచీ పార్టీలో అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నా రు. ఈ క్రమంలో ఆయన ఎలాంటి భేషజాలకూ పోవడం లేదు.

మొదటిసారిగా ప్రధాని మోడీని కలిసేందుకు అపాయింట్ మెంట్ లభించినప్పుడు, రేవంత్ ఒక్కరే వెళ్లి ప్రధానిని కలిసి ఉండవచ్చు. కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లోనూ భట్టికి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. తాను ప్రధానితో ఏం మాట్లాడననే విషయమై పార్టీలో వదంతులు రేకెత్తకూడదని ముందుచూపుతోనే ఆయన ఇలా చేశారు. తొలిరోజు పదిమం ది మంత్రులతో కలసి రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే ఫలానా మంత్రికి ఫలానా పోర్టు ఫోలియో కేటాయించారంటూ వార్తలొచ్చేశాయి. నిజానికి కొందరు మంత్రుల అనుచరులు మీడియాకు ఇచ్చిన తప్పుడు సమాచారమిది. ఇది గ్రహించిన రేవంత్.. ఏయే మంత్రులకు ఏయే శాఖలు ఇవ్వాలో జాబితా తయారు చేసుకుని, ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. అక్కడ అధిష్ఠానానికి ఆ జాబితా చూపించి, ఆమోదముద్ర వేయించుకుని తిరిగి వచ్చారు. దాంతో మంత్రులెవరికీ అసమ్మతిరాగాలు ఆలపించేందుకు అస్కారం లభించలేదు.

గతంలో ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా, మంత్రుల్లోనూ, ఎమ్మెల్యేలలోనూ అసమ్మతి మొదలయ్యేది. ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రిపై అధిష్ఠానానికి ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పేవారు. ఈ సంస్కృతికి రేవంత్ చెక్ పెడుతూ, తన నిర్ణయాలకు ముందుగానే అధిష్ఠానం అనుమతి తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ అయన అధిష్ఠానం అనుమతి తీసుకున్నారని, రేపోమాపో కొన్నిపోస్టుల భర్తీ జరుగుతుందనీ తెలుస్తోంది. మంత్రులలో చాలా మంది కంటే వయసులో రేవంత్ చిన్నవారు. వయసులోనూ, పా ర్టీలోనూ తనకంటే అనుభవం ఉన్నవారనే ఉద్దేశంతో మంత్రులకు సముచిత గౌరవం ఇచ్చి మాట్లాడుతూ ఉం టారు. వారిని ‘అన్నా’ అనో, ‘మీరు’ అనో సంబోధిస్తారే తప్ప ఏకవచనంలో మాట్లాడరు. లోక్‌సభ ఎన్నికల్లో సో నియా గాంధీని తెలంగాణనుంచి పోటీ చేయించాలన్న నిర్ణయం కూడా రేవంత్‌దే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్తెసరు మార్కులే దక్కాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన దానికంటే నాలుగు సీట్లు మాత్రమే అదనంగా గెలుచుకుని, పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి లోక్ సభ ఎన్నికలు నల్లేరుపై బండిలా సాగే అవకాశం లేదు. ఇది గ్రహించిన రేవంత్.. సోనియా గాంధీని తెలంగాణానుంచి పోటీ చేయించాలని ఆలోచన చేశారు. అదే జరిగితే, సోనియాగాంధీ ఇమేజీతో లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది.

సంక్షేమం ఒక సవాలే!
కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు రే వంత్ ప్రభుత్వానికి ఒక సవాల్ అనే చెప్పాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వం, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు జరపడం కత్తిమీద సాములాంటిదే. ఇదిలాఉంటే,కాంగ్రెస్ ప్రకటించిన ఆరింటిలో ఐదు పథకాల అమలుకు తెల్లరేషన్ కార్డును అర్హతగా నిర్ణయించడం మధ్యతరగతి ప్రజానీకాన్ని నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహా యం, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు తమ కూ వర్తిస్తాయని మహిళాలోకం ఆశించింది. కానీ, ఈ పథకాలు పొందాలంటే లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలని ప్రభుత్వం ప్రకటించడంతో వా రంతా నిరాశ చెందుతున్నారు. వారిని ముఖ్యమంత్రి ఎలా సముదాయిస్తారో వేచి చూడాలి. ఇక అర్హత ఉండీ, తెల్లరేషన్ కార్డులు లేనివారికి కొత్తగా కార్డులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News