పార్టీ ముఖ్య నేతలతో భేటీ
కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చ
ప్రధాని మోడీని కలవనున్న సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పైన రేవంత్ హైకమాండ్ చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు.
లోక్ సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధ్దం చేసినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ ఇప్పుడు లోక్ సభ సీట్ల పైన గురి పెట్టింది. సోమవారం జరిగిన పిఎసి సమావేశంలో నెల ముందుగానే లోక్ సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సిఎం రేవంత్ అప్రమత్తం చేసారు. దీంతో, లోక్ సభ సీట్ల వారీగా మంత్రులను ఇంఛార్జ్ లుగా నియమించారు. ఢిల్లీ పర్యటనలో అభ్యర్దుల ఖరారు పైన చర్చించనున్నారు. ఇప్పటికే జాబితా పైన ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పార్టీ సీట్ల గెలుపు బాధ్యత హైకమాండ్ సీఎం రేవంత్‌కు అప్పగించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. దీంతో ముందుగానే అభ్యర్దులను ఖరారు చేసి ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు.
అందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్దుల ఎంపిక పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అభ్యర్దుల ఖరారులో రేవంత్ సూచనలకు ప్రాధాన్యత దక్కనుంది. అభ్యర్దులను ఎఐసిసి అధికారికంగా ప్రకటించనుంది. 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కేబినెట్‌లో కూర్పుపై మరోసారి పార్టీ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్‌లో ఇంకా ఆరుగురిని తీసుకోవాల్సి ఉంది. తొలి కేబినెట్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఆ జిల్లాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించే అవకాశాలున్నాయని అంటున్నారు.