కరీంనగర్: రాష్ట్ర పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి మాటాడుతున్న మాటలన్నీ చంద్రబాబు మాట్లాడిస్తున్న మాటలేనని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలార్ పాల్గొని మాట్లాడుతూ పక్క రాష్ట్రాలకు తెలంగాణ కరెంట్ తరలించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని ఆరోపించారు.
అలాంటి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్లీ దీపాలే దిక్కు అవుతాయి అని అన్నారు. కాంగ్రెస్ పాలించే కర్ణాటక లో తిండి లేక తెలంగాణ రాష్ట్రాన్ని బియ్యం అడిగారని, కరెంట్ కూడా సరిపడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టిందని ఆరోపించారు. ఓవైపు బిజెపి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే, మరోవైపు కాంగ్రెస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దు అని రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని 24గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దక్కిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉండేది కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నామని, మొదటి నుంచి కాంగ్రెస్‌కు రైతులంటే చిన్నచూపేనని, వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అంటున్నారని అన్నారు.
తెలంగాణలో పచ్చదనం చూసి రేవంత్‌రెడ్డి కళ్ళల్లో నిప్పులు పో సుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతును రాజు చేయాలని సిఎం కెసిఆర్ రైతుల కోసం మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతు సంక్షేమం కోసం 30 వరకు పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా పలు రకాల రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమమే లక్షంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.