Monday, December 23, 2024

’15నుంచి’ రెవెన్యూ సదస్సులు

- Advertisement -
- Advertisement -

భూ సమస్యల పరిష్కారమే లక్షం

11న అవగాహన సదస్సు
సిఎం అధ్యక్షతన
సమావేశాలు మండలం,
నియోజకవర్గం, రాష్ట్రం
యూనిట్‌గా సమస్యల గుర్తింపు
మండలానికి 100 మంది
అధికారులతో
బృందాల ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యలకు త్వరలోనే మోక్షం లభించనుంది. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు నిర్ణయించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్, డిఆర్‌ఒ, ఆర్‌డిఒలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సిఎం అధ్యక్షతన ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నారు. ఈ సదస్సుల నిర్వహణకు సంబంధించి అవగాహన సదస్సును 11వ తేదీన ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సదస్సుల వల్ల ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలను ఈ సదస్సుల ద్వారా పరిష్కరించవచ్చని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

మండలం యూనిట్‌గా సమస్యలు గుర్తింపు

గతంలో తహసీల్దార్‌లు ఇచ్చిన 35 అంశాలకుగాను ఇప్పటికే 25 నుంచి 30 అంశాలకు సంబంధించి కొత్త మాడ్యూల్స్‌ను పోర్టల్‌లో ప్రవేశపెట్టగా త్వరలోనే అవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా మండలం యూనిట్‌గా సమస్యలు గుర్తించి, అనంతరం నియోజకవర్గం, ఆ తర్వాత రాష్ట్రం యూనిట్‌గా ధరణి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది.

ములుగు సమస్యలకు పరిష్కారం

వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరగాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో డేటా పొందుపర్చిన సమయంలో జరిగిన తప్పిదాలు, పొరపాట్ల వల్ల రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇందుకు సంబంధించి కసరత్తు చేసి కొన్ని మాడ్యూల్స్ సిఫారసు చేయడంతో కొన్ని అందుబాటులోకి రాగా మిగతావి అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండడంతో 15 రోజులు క్రితం సిఎం ఆదేశాలకు అనుగుణంగా మంత్రి హరీష్‌రావు, సిఎస్‌తో పాటు పలువురు అధికారులు సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించడంతో వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టెక్నికల్ టీం పరిష్కారం

ములుగులో మొత్తం 186 ఫిర్యాదులు రాగా అందులో వంద వరకు న్యాయవివాదాలు, సాదా బైనామాలు తదితరాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మిగిలిన 80 సమస్యలు తప్పిదాలు, పొరపాట్లు, ఇతర కారణాల వల్ల ఉత్పన్నమయ్యాయని వాటిని పరిష్కరించే అవకాశం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ధరణి పోర్టల్‌లో ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్యలను చూసుకుంటే ఒకేరకానికి సంబంధించి చాలా ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తహసీల్దార్‌లు తీసుకొచ్చారు. పేర్లలో పొరపాట్లు, సర్వే విస్తీర్ణం నమోదులో తప్పిదాలు, భూమి వర్గీకరణ, ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములకు సంబంధించి దశాబ్దాలుగా ఆ భూములను అనుభవిస్తున్న రైతులకు వారి పేరున నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి సమస్యలకు టెక్నికల్ టీం పరిష్కారం చూపించడంతో త్వరలోనే వాటిని పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News