Monday, December 23, 2024

సెస్సు బుస్సులు!

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాలను మోసం చేసి సొంత ఖజానాను పొంగిపొర్లేలా నింపుకొనే క్రీడలో కేంద్రంలోని బిజెపి పాలకులు ఆరితేరిపోయారు. ఇందుకోసం సహకార ఫెడరలిజం విలువలను, సూత్రాలను సమాధిగతం చేస్తున్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు గట్టిగా ప్రస్తావించాయి. అసోం సహా కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా వీటితో గొంతు కలపడం విశేషం. రాష్ట్రాలతో పంచుకొని తీరవలసిన పన్నులను వసూలు చేసే సమయంలో కేంద్రం సెస్‌లు, సర్‌ఛార్జీలు విధించి సొంత ఆదాయాన్ని పెంచుకోవడం, దానిలో రాష్ట్రాలకు వాటా ఇవ్వకపోవడంపై ఇవి నిరసనను వ్యక్తం చేశాయి. సెస్‌లను, సర్‌ఛార్జీలను మౌలిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు తగిన వాటా పంచాలని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ డిమాండ్ చేశారు. సెస్‌లు, సర్‌ఛార్జీలపై రాజ్యాంగం షరతులు విధించినప్పటికీ కేంద్రం వీటిని పెంచుతూ పోతున్నదని ఇది ఫెడరల్ సూత్రానికి విరుద్ధమని కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ అన్నారు.

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ద్వారా తెలియజేసిన అంశాల్లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. మొత్తం కేంద్రం వసూలు చేసే పన్ను ఆదాయంలో 41 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినప్పటికీ కేంద్రం అంచనాల మేరకే ఇది 29.7 శాతంగా వున్నదని, రాష్ట్రాలను ఆదుకోడానికి సెస్ ఆదాయంలో కూడా వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం వసూలు చేస్తున్న సెస్‌లు, సర్ ఛార్జీల మొత్తం 201011లో రూ. 49,628 కోట్లు కాగా, పదేళ్ళు గడిచే సరికి 202122 నాటికి రూ. 3,74,471కి విజృంభించింది. ఇందులో ఒక్క పైసా అయినా రాష్ట్రాలకు అందలేదు. రాజ్యాంగం 7వ షెడ్యూల్‌లోని 246 అధికరణ కేంద్ర జాబితా కింద ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ప్రజల నుంచి వసూలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే రాష్ట్రాలతో పంచుకోనవసరం లేకుండా సెస్‌లు, సర్‌ఛార్జీలు విధించే అధికారాన్ని రాజ్యాంగం 270 అధికరణ కేంద్రానికి ఇస్తున్నది.

ప్రజల కోసం ఖర్చు చేయవలసిన బాధ్యతలో రాష్ట్రాలది 62 శాతం అయితే కేంద్రానిది 37 శాతమేనని 15వ ఆర్థిక సంఘం అభిప్రాయపడింది. ఇందుకు విరుద్ధంగా వసూలు అధికారాల్లో 63 శాతం కేంద్రం వద్ద వుండగా రాష్ట్రాల వద్ద వాటిపై గల ఖర్చు బాధ్యతలో 38 శాతం మేరకే వసూలు అధికారాలున్నాయని స్పష్టం చేసింది. కేంద్రం వసూలు చేసే పన్నుల నుంచి రాష్ట్రాలకు ఇచ్చి తీరవలసిన వాటాను నిర్ణయించడానికి ప్రతి ఐదేళ్లకోసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తున్నారు. ఇది సహకార ఫెడరలిజాన్ని ఆచరణలో పెడుతున్నది. కాని సెస్‌లు, సర్‌ఛార్జీల వడ్డింపు వల్ల అది దెబ్బ తింటున్నది. 2010-11 నుంచి 2013-14 వరకు కేంద్రం 15 రకాల సెస్‌లను, సర్‌ఛార్జీలను విధించింది. 2019-20 నాటికి ఇవి 25కి పెరిగాయి. వస్తు, సేవల పన్ను అవతరణతో వీటి సంఖ్య తొమ్మిదికి పడిపోయింది.

అయినప్పటికీ వాటి నుంచి కేంద్రం పిండుకుంటున్న వసూళ్ల ఆదాయం రోజురోజుకీ పెరిగిపోతున్నది. మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజెల్ ఆయిల్ పై కేంద్రం తాను వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకానికి అదనంగా విధిస్తున్న రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను విపరీతంగా పెంచివేసింది. 2018-19లో రూ. 51,266 కోట్లుగా వున్న ఈ సెస్ వసూలు 2020-21 నాటికే రూ. 2,24,000కి చేరింది. కేంద్రం అధికంగా సెస్‌ల మీద ఆధారపడడంతో రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్ను ఆదాయం పడిపోతున్నది. వాస్తవానికి కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం (2015-2020) 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. అయితే అదే కాలంలో రాష్ట్రాలకు అందిన వాటా 34 శాతమే. అలాగే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం (2021-2026) సిఫారసు చేయగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందిన వాటా మొత్తం నిధులలో 30 శాతమే.

సెస్‌లు, సర్ ఛార్జీల దొడ్డిదారి ఆరగింపును కేంద్రం మానుకోనైనా మానుకోవాలి లేదా వాటి ద్వారా వస్తున్న ఆదాయాన్ని కూడా రాష్ట్రాలతో పంచుకోవాలి. సెస్‌ల ఆదాయాన్ని దేనికోసం ఉద్దేశించారో దానికి మాత్రమే వినియోగించాలనే నీతిని కూడా కేంద్రం తప్పుతున్నదని తెలుస్తున్నది. ఈ తప్పుడు విధానం పట్ల కాగ్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సెస్‌ల ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాలని 14, 15వ ఆర్థిక సంఘాలు సైతం సిఫారసు చేశాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇక నుంచైనా వాటి హితవును పాటించాలి. అలా చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కృషిని మరింతగా చేపట్టి ప్రజలకు మేలు చేయగలుగుతాయి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News