Friday, November 22, 2024

రిజిస్ట్రేషన్లపై రికార్డు రాబడి

- Advertisement -
- Advertisement -

Revenue from registrations was Rs 12,364 crore

మార్చి నెలలోనే రూ.1501 కోట్లు

తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్
రిజిస్ట్రేషన్ల నుంచి రూ.12,364 కోట్ల ఆదాయం
ఒక్క మార్చి నెలలోనే రూ.1501 కోట్లు ఆదాయం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం నుంచి ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో అంచనాలకు మించిన స్థాయిలో ఏకంగా 12,364 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క మార్చి నెలలోనే గత రికార్డులను బద్దలు కొట్టే విధంగా 1501 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఉన్న ప్రత్యేక పరిస్థితులు, వాతావరణం, భూముల విలువలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుండటం, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, తాగునీటికి ఢోకా లేకుండా సరఫరా చేస్తుండటం, రోడ్లు, శాంతి-భద్రతల పరిరక్షణ వంటి అం శాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంతోనే జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని తమతమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుండటంతో స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డుస్థాయిలో ఆదాయం వస్తోంది. దక్కన్ పీఠభూమి కావడంతో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ వ్యాపారాలను జాతీయస్థాయిలో విస్తరించుకొన్నాయి.

అంతేగాక ప్రపంచంలోని వివిధ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత విద్యలను అభ్యశిస్తూ, ఉద్యోగాలు చేసుకొంటూ ఆర్ధికంగా స్థిరపడిన వారు, ఆర్ధికంగా సముపార్జన బాగున్న ఎన్.ఆర్.ఐ.లు, విద్యార్ధులు కూడా సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే కోరికతో భారీగా స్థలాలు కొనుగోలు చేస్తున్నారని, అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకొందని అంటున్నారు. అంతేగాక రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ తమ తమ వ్యాపారాలన్నింటినీ ముంబాయి హై వే, బెంగుళూరు హై వే, పూనా హైవే (మేడ్చెల్), విజయవాడ హై వేలకే పరిమితంగా ఉండేవని& కానీ టి.ఆర్.ఎస్. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కె.సి.ఆర్. యాదగిరిగుట్టను అత్యున్నతమైన ప్రమాణాలతో పునర్‌నిర్మించి ఎంతో వైభవంతంగా తీర్చిదిద్దడంతోనూ, వరంగల్లు హై వే ను కూడా నాలుగు లైన్ల రహదారిగా నిర్మించడంతో ఫాం హౌస్‌లు, విల్లాలు, ప్లాట్ల వ్యాపారస్తులు కూడా భువనగిరి, యాదగిరిగుట్టల వరకూ రియల్ ఎస్టేట్ కంపెనీలు విస్తరించాయని, అందుకే హద్దులు చెరిపేసే విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్లు విస్తరిస్తున్నాయని, వీటన్నింటి ప్రభావమే స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్ళు భారీగా జరుగుతున్నాయని రెవెన్యూశాఖకు చెందిన కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

వీటన్నింటికీతోడు ఔటర్ రింగు రోడ్డును నిర్మించిన తర్వాత రీజినల్ రింగ్ రోడ్డును కూడా నిర్మించే కార్యక్రమాలు ఊపందుకోవడంతో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు తమతమ వెంచర్లను కూడా రీజినల్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించాయని అధికారులు వివరించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే హైదరాబాద్ నగరం మెడికల్, ఫార్మా హబ్‌గా మారిందని, అందుకే అభివృద్ధి చెందిన దేశాల నుంచి తమతమ రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయించుకోవడానికి చికిత్స కోసం హైదరాబాద్ నగరానికి వస్తుండటం, ఫార్మా ఇండస్ట్రీ కూడా అనూహ్యంగా పెరిగిపోవడంతోనూ రియల్ బూమ్‌కు దోహం చేశాయని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో నివాసం ఉండటానికి అలవాటుపడిన సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు కూడా మళ్ళీ హైదరాబాద్‌లోనే స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి అత్యధిక ఉత్సాహం చూపిస్తుండటం కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయని ఆ అధికారులు వివరించారు. ఈ మొత్తం కారణాలను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తుల వ్యాపారం మూడు పువ్వులు& ఆరు కాయలు అన్నట్లుగా సాగుతుండటంతోనే స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖకు రికార్డుస్థాయిలో ఆదాయాన్ని సమకూర్చి పెడుతోందని ఆ అధికారులు సగర్వంగా చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News