లబ్దిదారులు అందుబాటులో ఉండాలని అధికారుల సూచనలు
రెండు రోజులుగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరణ
స్థలానికి సంబంధించిన గుర్తింపు పత్రాలు ఉంచుకోవాలి
గ్రేటర్ మూడుజిల్లాల పరిధిలో 56వేలకుపైగా దరఖాస్తులు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలన చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి పలు బస్తీలు, కాలనీలు తిరుగుతూ ఇంటి స్దలాలను చూసి సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూస్తూ లబ్దిదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. మొదటి రెండు రోజులు చాలా ప్రాంతాల్లో దరఖాస్తుదారులు లేకపోవడంతో అధికారులు వెనక్కి మళ్లీ వచ్చారు. మూడో రోజు మాత్రమే ఉదయం, సాయంత్ర వేళ ఉండగా వారికి సంబంధించిన స్దలాను చూసి ప్రభుత్వానికి ఎంత ఫీజు చెల్లించాల్లో తరువాత తెలియజేస్తామని పేర్కొంటున్నట్లు స్దానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రభుత్వ స్దలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్దీకరించడానికి జీవో నెం. 58, 59 జారీ చేసింది. దీంతో నగరవాసులు సమీపంలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు చేశారు. మొదటి జీవో నెంబర్లు 58, 59 విడుదల చేయగా దానికి అనుబంధంగా జీవో నెంబర్ 14 విడుదల చేసింది. ప్రభుత్వం 125 గజాల లోపు స్దలాల్లో నిర్మాణాలు చేసుకుంటే ఉచితంగా క్రమబద్దీకరిస్తుంది.
250 గజాలలోపు ఉన్నవాటిని మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 500 గజాలలోపు ఇళ్లకు 75శాతం అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే వందశాతం రుసుము వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. మూడు జిల్లాల పరిధిలో ఎక్కువగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి. గ్రేటర్ పరిధిలో మొదట్లో 1.65లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి 35 శాతానికి పడిపోయాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డిలో 31,830, మేడ్చల్‌లో 14,500, హైదరాబాద్ జిల్లాలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
వీటిని పూర్తిగా పరిశీలన చేసి అర్హులైన వారిని స్దలాలు క్రమబద్దీకరణ చేస్తామని, తప్పుడు ధృవప్రతాలు సమర్పిస్తే తిరస్కరిస్తామని, నల్లా బిల్లు, కరెంట్లు బిల్లులు ఆయా శాఖలకు పంపించి వారు సరైనదేనని సమాచారం ఇస్తే వాటిని రెగ్యులర్ ప్రక్రియ వేగం చేస్తామని చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లో కొంతమంది రాజకీయ దళారులు క్రమబద్దీకరణ చేస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని వారిపట్ల జాగ్రత్తంగా ఉండాలని లబ్దిదారులకు సూచిస్తున్నారు. నిజమైన లబ్దిదారులకు న్యాయం చేస్తామని, పైరవీకారులను ఆశ్రయించవద్దని కోరుతున్నారు. ఆగస్టులోవరకు అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి పట్టాలు అందజేస్తామని మండలాధికారులు వెల్లడిస్తున్నారు.