Thursday, January 23, 2025

మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గంలోని మిషన్ భగీరథ పనులపై జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిదులతో శనివారం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు సురక్షితమైన మంచి నీటిని అందిస్తున్న గొప్ప పథకం మిషన్ భగీరథ అన్నారు. ఐక్యరాజ్యసమితితో పాటు విదేశీ సంస్థలు ఈ పథకాన్ని ప్రశంసించాయన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 102 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలోని 64 వార్డుల వారీగా మిషన్ భగీరథ, గ్రిడ్ పనులపై సమీక్షించారు. ఆగష్టు 15లోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలని, అధికారులు ఒక రోడ్ మ్యాప్ నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 283 ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి 67,163 గృహాలకు 2,62,000 ప్రజలకు తాగు నీరు అందిస్తున్నామన్నారు.

వర్షాకాలం దృష్టా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులను వేగవంతం చేయాలన్నారు. అన్ని హ్యాబిటేషన్స్‌కు మంచినీటి సరఫరా జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగు నీరు అందించే విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని కాంట్రాక్టర్లను, ఏజెన్సీ అధికారులను హెచ్చరించారు. అవసరమైతే పని చేయని కాంట్రాక్టర్‌లతను తొలగించి కొత్త వారిని నియమించి పనులను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే పూర్తయిన గ్రామాల్లో జరుగుతున్న నీటి సరఫరాలో లీకేజీలు గాని, డ్యామేజ్‌లు కాని ఉంటే మరమ్మత్తులు చేయాలని, మిషన్ భగీరథ వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే నిర్మించాలన్నారు.

వార్డు, గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తాగు నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పని చేసి పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలన్నారు.

మిషన్ భగీరథ ఇంట్రా పనులకు సంబందించి ఎలాంటి ఇబ్బందికర పరిస్ధితులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే పై అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యపరంగా సురక్షిత మంచి నీరు అందించడానికి నిర్దేశించిన ప్రణాళికతో మంచి నీటి సరఫరా చేస్తున్నామన్నారు.

సురక్షిత మంచి నీటిని అందించే విధానాన్ని తమ తమ గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్ వద్ద ప్రజలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చని, మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా తామే చూసుకుంటున్నామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల వారీగా ప్రజల నుండి సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు.

ఎక్కడ ఏ సమస్య తలెత్తినా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, గ్రామ స్థాయిలో మంచి నీటి సరఫరాకు అఅధికారులతో పాటు గ్రామ వాటర్ మెన్, సెక్రెటరీ, సర్పంచ్ సహకారం ఎప్పుడు ఉండాలని, ఏజెన్సీలు పని చేసిన వెంటనే క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెక్ చేసిన అనంతరం బిల్స్ చెల్లిస్తున్నామని, పెండింగ్ బిల్లులు ఏమి లేవన్నారు.

చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి రెండు వారాలకు ఒకసారి నియోజకవర్గ స్థాయి రివ్యూ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ జ్ఞాన్ కుమార్, ఈఈ అంజన్‌రావు, మధుసూదన్, ఈఈపీఆర్ ప్రకాష్, ఏఈ ఆండ్ డీఈఈలతో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రెటరీలు, నియోజకవర్గ ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, ఏజెన్సీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News