సింగరేణిలోని న్యాయ విభాగంలో కేసుల స్థితిగతులపై సమీక్ష
అధికారులతో సమావేశం జరిపిన సింగరేణి జిఎం సూర్యనారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి వ్యాప్తంగా పలు సమస్యలపై వివిధ కోర్టుల్లో పలు స్థాయిల్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు ఏరియా న్యాయ విభాగం, పర్సనల్ విభాగం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జనరల్ మేనేజర్ (సిడిఎన్) కె.సూర్యనారయణ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ కల్లా వీటి స్థితిగతులను హైదరాబాద్ లా విభాగానికి సమర్పించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి శనివారం జిఎం సింగరేణి వ్యాప్త కార్పొరేట్, రీజనల్ న్యాయవిభాగం అధికారులు, ఏరియా పర్సనల్ అధికారులు, ఎస్టేట్స్ అధికారులతో సమీక్ష జరిపారు.
కేసుల్లో ప్రధానంగా భూసేకరణ, పునరావస సమస్యలు, పుట్టినరోజు మార్పు, డిపెండెంట్, సర్వీసు సంబంధ సమస్యలకు సంబంధించి ఏరియాల వారీగా వీటికి సంబంధించి కోర్టులకు సమర్పించాల్సిన వివరాలను తయారుచేసి వెంటనే పంపించాలని జిఎం ఆదేశించారు. కోర్టులో కేసులు పెండింగ్ లేకుండా చూసేందుకు తగిన శ్రద్ధ వహించాలని కోరుతూ దీనిపై సింగరేణి రీజనల్ న్యాయ విభాగం అధికారులకు, హైదరాబాద్ లా విభాగం అధికారులకు సహకరించాలని ఆయన సూచించారు.
పూర్తి అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచాలి: శ్రీనివాసరావు
హైకోర్టులో సింగరేణి కేసులకు సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసులకు సంబంధించిన పూర్తి అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని, ఈ నేపథ్యంలోనే ఏరియాల నుంచి మరింత సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా జిఎం. పర్సనల్ (ఐఆర్, ఆర్‌సి బ పిఎం) ఎ.ఆనందరావు, డిప్యూటీ లా మేనేజర్ శిరీషారెడ్డి, అడిషినల్ మేనేజర్ దుండె వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.