Friday, November 22, 2024

మెత్తబడ్డ కేంద్రం!

- Advertisement -
- Advertisement -

ఎఫ్‌ఆర్‌బిఎం అంశంలో తెలంగాణ వాదనలపై సమీక్ష
తెలంగాణ ఆర్థికశాఖతో మంతనాలు?
కోర్టుకెళ్లే ప్రతిపాదనను వాయిదా వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అప్పుల రూపంలో నిధులను సేకరించేందుకు అనుమతులు మంజూరు చేసే విధంగా కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య మంతనాలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖాధికారులు లేవనెత్తిన ప్రశ్నావళిపై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖాధికారులు కూడా కాస్తంత మెత్తబడినట్లుగా తెలిసింది. కార్పోరేషన్ల ద్వారా సేకరించిన అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని, ఆ అప్పులను కూడా ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టం పరిధిలోనే లెక్కిస్తామని కేంద్రం చేసిన వాదనలు ముమ్మాటికీ లోపభూయిష్టంగా ఉన్నాయని, కేంద్రమే అడ్డగోలు ఉత్తర్వులు జారీ చేసి చేతులు కాల్చుకున్నట్లుగా కేంద్ర ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు సైతం అంగీకరించారనే సమాచారం రాష్ట్ర ఆర్ధికశాఖాధికారులకు అందినట్లు తెలిసింది. 2020వ సంవత్సరం నుంచి 2021వ సంవ్సరంలో కార్పోరేషన్ల ద్వారా సేకరించిన పాత అప్పులను కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చిన ఉత్తర్వులే కేంద్ర ఆర్ధికశాఖ మెడకు చుట్టుకున్నాయని అంటున్నారు. ముందుగా నిర్ణయించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం పాత అప్పులను కొత్త రూలు పరిధిలోకి తీసుకొచ్చి లెక్కించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసును దాఖలు చేయాలనే ప్రతిపాదనను కూడా వాయిదా వేస్తూ రావడానికి కూడా కేంద్ర ఆర్ధికశాఖాధికారులు పునరాలోచనలో పడినందువల్లనేనని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టం ప్రకారం అప్పులు తెచ్చుకోవడానికి, రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర పథకాల నిర్మాణాల కోసం విద్యుత్తు ఆర్ధిక సంస్థ (పి.ఎఫ్.సి), గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ (ఆర్.ఇ.సి) సంస్థలు, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో సేకరించాల్సిన 53,970 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా గడచిన మూడు నెలలుగా బ్రేకులు వేస్తూ వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల పనులన్నీ ముందుకు సాగకుండా మందగించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు మంజూరు చేసిన కేంద్రం ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే క్లియరెన్స్‌లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిందని, దీంతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై జాతీయస్థాయిలో చర్చలు జరుగుతున్న అంశాలను కూడా కేంద్ర ఆర్ధికశాఖ దృష్టికి వచ్చిందని ఆ అధికారులు వివరించారు. అందుకే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖాధికారుల సూచన మేకే తాము ఈ వివాదంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయాలనే ప్రతిపాదనను కూడా వాయిదాలు వేస్తూ వస్తున్నామని వివరించారు.

అంతేగాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆర్ధికశాఖా మంత్రి టి.హరీష్‌రావు, మున్సిపల్ వ్యవహారాల శాఖామంత్రి కె.టి.రామారావుల దగ్గర్నుంచి మిగతా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో, జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, చివరకు గ్రామాల్లో జరుగుతున్న చిన్నాచితక సభల్లో కూడా కేంద్ర ప్రభుత్వ తీరును, కేంద్రంలోని బి.జె.పి.నేతలు తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శల దాడి అంబరాన్ని అంటడంతోనే కేంద్ర ఆర్ధికశాఖాధికారులు కూడా మెత్తబడ్డారని తెలిసింది.

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు, ఆర్ధిక క్రమశిక్షణ, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులను ఖర్చు చేస్తున్న వైనం, తలసరి ఆదాయం పెరిగిన విధానాలు, పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తుండటం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కీర్తించిందని, నేడు తెలంగాణ రాష్ట ఆర్ధిక విధానాలు బాగాలేవని మాట మార్చినా ఎవ్వరూ నమ్మడంలేదని, ఈ అంశాలను కేంద్రం గుర్తించిందని ఆ అధికారులు వివరించారు. అందుకే తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి కేంద్ర ఆర్ధిక శాఖాధికారులు కసరత్తులు చేస్తున్నారని ఆ అధికారులు వివరించారు. అందుకే తాము కూడా తెగే వరకూ లాగకుండా, ఆచీతూచీ అడుగులేస్తూ సంయమనం పాటిస్తున్నామని, కేంద్రం మొండిగా ప్రవర్తిస్తే అప్పుడు సీఎం కే.సి.ఆర్.కు పరిస్థితిని వివరించి తదుపరి కఠిన చర్యలు తీసుకొంటామని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News