కరోనా సంక్షోభం తలెత్తినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రశాంత వాతావరణంలో గత సమావేశాలు
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డిలు
మనతెలంగాణ/హైదరాబాద్: పక్క రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా, ఆదర్శంగా రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించని విధంగా శాసనసభ, శాసన మండలి సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డిలు పేర్కొన్నారు. నేటి నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీలోని కమిటీహల్‌లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కరోనా సంక్షోభం తలెత్తినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నీతిఆయోగ్ చైర్మన్ మెచ్చుకున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాల్లో మాదిరిగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని ఆయన కోరారు. సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలి
గత సమావేశాల మాదిరిగానే ఆయా శాఖల తరుపున ప్రత్యేకంగా నోడల్ అధికారులు సభలోని బాక్స్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. గత సమావేశాలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలన్నారు. సమావేశాల సమయంలో కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటుగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గణేశ్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినందుకు పోలీసు శాఖకు ఆయన అభినందనలు తెలిపారు. సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని స్పీకర్ పేర్కొన్నారు. గతంలో ఏడు సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి, ఈసారి కూడా అదేవిధంగా జరగడానికి పోలీసు శాఖ తరుపున పూర్తి సహాయ, సహకారం అందించాలని కోరారు. ఇతర రాష్ట్రాల శాసనసభలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సమర్ధవంతంగా జరుగుతున్నాయన్నారు.
ప్రజా సమస్యలపై తగిన సమయం కేటాయిస్తాం
ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉభయ సభల సమావేశాలు సజావుగా నడుపుతామన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు అనే తేడా లేకుండా ప్రజా సమస్యలను సభల్లో ప్రస్తావించడానికి తగిన సమయాన్ని కేటాయిస్తూ అర్ధవంతమైన సభను నడిపిస్తున్నామన్నారు. గత సమావేశాల్లో పని చేసిన విధంగా నేటి నుంచి జరిగే సమావే శాల్లో అధికారులు పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు, ఘర్షణలు, జరగకుండా పోలీస్ యంత్రాంగం బాగా పనిచేస్తోందని ప్రొటెం చైర్మన్ ప్రశంసించారు. సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ ప్రాంతాల నుంచి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని భూపాల్ రెడ్డి సూచించారు. సమావేశాలకు వివిధ శాఖలకు చెందిన అధికారులు తప్పకుండా హాజరై, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తగిన సమాచారం అందించాలన్నారు. సమావే శాలకు హాజరయ్యే సభ్యులు, అధికారులు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి సూచించారు.
వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోండి: మంత్రి వేముల
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అంశంపై సభ్యులందరూ కులకుశంగా మాట్లాడడానికి అవకాశం లభిస్తుందనానరు. లోపల సభ సజావుగా సాగడానికి అసెంబ్లీ లోపల బయట పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ఈ సమావేశాలు కూగా గత సమావేశాల మాదిరిగానే సజావుగా సాగడానికి అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. శాసనసభ సమావేశాలు పూర్తి అయ్యే వరకు సమన్వయం కోసం సెక్రటరీ, పోలీస్ ముఖ్య అధికారులతో కలుపుకొని వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సనసభ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) వికాస్ రాజ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు హాజరయ్యారు.