మన తెలంగాణ/ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీతపై అదే పార్టీకి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రత్యేక అధికారి ఆర్‌డిఒ వినోద్‌కుమార్ తెలిపారు. గురువారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం హాల్లో కౌన్సిలర్ల సమావేశం నిర్వహించగా బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 20మంది కౌన్సిలర్లు, బిజెపి పార్టీకి చెందిన 4కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా ఎక్స్ అఫిసియో హోదాలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు.
ప్రస్తుత చైర్‌పర్సన్ పండిత్ వినీత ఆమె మద్దతుదారులు సమావేశానికి హాజ రు కాలేదు. కాగాఅవిశ్వాస తీర్మాని కి 24 ఓట్లు కావాల్సింది ఉండగా బిఆర్‌ఎస్ పార్టీ బిజెపి మద్దతుతో అ విశ్వాసం నెగ్గిందని ఆర్‌డిఒ తెలిపారు. జిల్లా పరిపాలనాధికారి ఆదేశాల మేరకు తొందరలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నుకుంటామన్నారు. అవిశ్వాసం నెగ్గగానే కౌన్సిలర్ అందరూ క్యాంపునకు తరలివెళ్లారు.
బిఆర్‌ఎస్ అవినీతిపై బిజెపి పంతం నెగ్గింది : ఎంఎల్‌ఎ పైడి
బిఆర్‌ఎస్ అవినీతిపై బిజెపి పంతం నెగ్గిందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గత కొంతకాలంగా బిఆర్‌ఎస్ అవినీతిపై బిజెపి పోరాటం చేస్తుందని ఆ పోరాట ఫలితమే గురువారమే అవిశ్వాసం నెగ్గిందన్నారు. ఏసిపి జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ ఆర్మూర్ మున్సిపల్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఆర్మూర్ పట్టణ రూరల్ సిఐలు సురేష్‌బాబు, గోవర్ధన్ రెడ్డి, డివిజన్ పరిధిలోని ఎస్సైలు 50 మంది పోలీస్‌తో భారీ బందోబస్తు నిర్వహించారు.
సమావేశ హాల్లోకి కౌన్సిలర్లు అధికారులు తప్ప ఇతరులను అనుమతించలేదు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, కమిషనర్ ప్రసాద్ చౌహాన్, డిఈ భూమేష్, మున్సిపల్ సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు.