Monday, December 23, 2024

ఉద్యమ ధృవతార గద్దరన్నకు విప్లవ జోహార్లు : పిడిఎఫ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యార్థి దశ నుంచి మరణించేవరకు అలుపెరుగని ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా మమేకమైన ప్రజా యుద్ధ నౌక తెలంగాణ సాంస్కృతిక, విప్లవ, ఉద్యమ దృవ తార గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు అంటూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోరం (పిడిఎఫ్ ) పిడిఎస్ యు పూర్వ విద్యార్థుల పక్షాన శ్రద్ధాంజలి ఘటించింది. విద్యార్థి దశలో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులైన గద్దర్ సుదీర్ఘ కాలం పీడిత తాడిత ప్రజల పక్షాన పోరాటం జరిపారని ఫోరం కన్వీనర్లు ఆర్.గుర్వారెడ్డి, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ప్రొఫెసర్ వినయ్ బాబు, ఇ. రఘునందన్ కొనియాడారు.

సుదీర్ఘ ప్రజా జీవితంలో అతి కొద్ది కాలం మినహాయించి తనను తాను ప్రజలకు అంకితం చేసుకున్నారన్నారు. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ప్రజా బహుళ్యం లో ఏ విధంగా, ఎన్ని రూపాలలో మలచాలో అన్ని రూపాల్లో మలచగలిగారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సిద్ధాంత భావజాల ప్రతిపాదికగా గద్దర్ అనేక ప్రజా పోరాటాలు నిర్మించారని, తన గానం చేత మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను ఐక్యం చేయగలిగారని పేర్కొన్నారు. వర్గ పోరాటంలో సాంస్కృతిక ఉద్యమం ఎంత బలమైన ప్రభావం చూపిస్తుందో గద్దర్ తన పాట చేత మరొకసారి రుజువు చేశారన్నారు. 20వ శతాబ్దపు ప్రగతిశీల ఉద్యమ రాజకీయాలలో ఒక సాంస్కృతిక సేనానిగా తనను తాను మలుచుకున్నారన్నారు. అణచివేత, కుల దోపిడి, వర్గ దోపిడీలకు వ్యతిరేకంగా తన జీవితకాలం వివిధ పోరాటాలలో నిమగ్నమయ్యారని, ఆయన మరణం ప్రజా పోరాటాలకు, సాంస్కృతిక ఉద్యమాలకు తీరని లోటని నివాళులర్పించారు ఆయన కుటుంబానికి పిడిఎఫ్ పక్షాన సంతాపాన్ని తెలియజేశారు. ప్రజా ఉద్యమాలలో కొనసాగటమే వారికి అర్పించే నిజమైన నివాళిగా భావిస్తున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News