పరీక్షలు నిర్వహించి సర్జరీ చేసినట్లు సూపరింటెండెంట్ రాజలింగం వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: విప్లవ కవి వరవరరావు కంటి పరీక్షల కోసం శనివారం సరోజినీ దేవి ఆస్పత్రికి వచ్చారు. భీమా కొరేగావ్ కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై ముంబైలో ఉంటున్న ఆయన ఆరోగ్య సమస్యలపై విమానంలో నగరానికి చేరుకున్నారు. నేరుగా సరోజినీ దేవి ఆస్పత్రికి వెళ్లడంతో కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయనను పరీక్షించిన వైద్యులు ఫాకో విధానంలో సర్జరీ చేశారు. దృష్టి సమస్యలు ఎదుర్కొంటున్నందున.. అన్ని రకాల పరీక్షలు చేసి వెంటనే సర్జరీ చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు.
వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సర్జరీకి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆరోగ్యం సహకరించడంతో అనెస్థీషియా ఇచ్చి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మందులు వాడాల్సి ఉన్నందున మరోసారి చెకప్ కోసం ఆస్పత్రిని సందర్శించే అవకాశమున్నదని వైద్యులు చెబుతున్నారు.