చరిత్ర సాహిత్యాల సంగమం
పులికొండ సుబ్బాచారి గారు ‘రేవు తిరిగబడితే’ నవలను చారిత్రక నవల అనడానికి సంశయిస్తున్నారు గానీ ఇది చారిత్రక నవలే. వారిది వినయం వల్ల వచ్చిన సంశయం మాత్రమే. ఇందులో చారిత్రక ఘటనలతో పాటు వాటిపై ఆధారపడి చేసిన కల్పన కూడా కొంత ఉంది అని ఆయనే అన్నారు. ఇకనేం, చారిత్రక నవల లక్షణమే అది. చారిత్రక నవల అంటే నవలంతా చారిత్రక పాత్రలూ చారిత్రక ఘటనలూ ఉండేది కాదు. ఉంటే అది చరిత్ర డాక్యుమెంటు మాత్రమే అవుతుంది. కొంత కల్పన కూడా ఉండాలి. అది చారిత్రక వాస్తవం మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు మాత్రమే అది సాహిత్యం లేదా నవల అవుతుంది. అన్నిటికన్నా చారిత్రక నవల లోని కల్పనాత్మకమైన ఇతివృత్తమూ, పాత్రలూ, సంఘటనలూ ఆ కాలపు చారిత్రక వాస్తవాలలో ఉండే కార్యకారణ సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అది చారిత్రక నవల అవుతుంది.
చారిత్రక నవల అన్న పదబంధం లో ఉన్న చరిత్ర, నవల అనే రెండు వేర్వేరు పదాల మధ్య బంధాన్ని కలిగించే అంశం ఈ కార్యకారణ సంబంధమే. ఒక చారిత్రక సందర్భాన్ని సాహిత్యం చెయ్యాలనుకునే రచయిత ముందుగా చారిత్రక సందర్భానికి దారితీసిన కారణాన్నీ, పర్యవసానంగా జరిగిన చర్యనీ, ఆ చర్య మళ్లీ కారణంగా మారి మరొక చర్యకు దారితీస్తున్న వైనాన్నీ వీటన్నిటి లోని dynamics ను అర్థం చేసుకోవాలి. కల్పిత పాత్రలకు ఆ గమనశీలతను అన్వయించి చరిత్రను పునఃసృజించాలి. చారిత్రక ఆధారాలను ముందుపెట్టుకుని చరిత్ర కారుడు చరిత్రను rewrite చేస్తే సాహిత్యకారుడు దాన్ని కళాత్మకంగా recreate చేస్తాడు. మనం చూడని కాలానికి సందర్భానికి చెందిన నిజ జీవితాల చోదక శక్తులు సృష్టించే సంఘర్షణల్ని సంవేదనల్నీ సౌందర్యాన్నీ కల్పిత పాత్రల్లోకి ప్రవేశ పెట్టి చరిత్రను సాహిత్యం చేస్తాడు సాహిత్యాన్ని చరిత్రను చేస్తాడు. చరిత్రను సాహిత్యం చేసినపుడు శాస్త్రం, కళ గా మారుతుంది.
సాహిత్యంలోకి చరిత్రను ప్రవేశపెట్టినపుడు కళ, శాస్త్రీయం అవుతుంది. ఇవి రెండూ సమపాళ్లలో కలవగా ఏర్పడే చరిత్రో సాహిత్యమో తెలీని సందిగ్ధ స్థితే చారిత్రక నవల అత్యున్నత స్థితి. Facts are sacred but subject to interpretation అని అంటూ ఉంటారు. అంటే facts మారవు కానీ అవి వేర్వేరు వ్యాఖ్యానాలకు గురికావొచ్చు అని అర్థం. ’వాస్తవం పవిత్రం’ అన్నప్పుడు పవిత్రమైన వాటిని మార్చడానికి వీలుండదు అనే religious bigotry ఉంది. ’but subject to interpretation’ అనడం చరిత్రకారునికి మనోధర్మం ఉంటుందని అంగీకరించడం. చరిత్రకారుడు వాస్తవాలను ఎంపిక చేసుకుంటాడని కూడా అంటారు. అంటే కొన్నిటిని వదలివేస్తాడని అర్థం కాదు. అవాస్తవాల నుంచి వాస్తవాలను వేరు చేస్తాడని. ఇదంతా చరిత్ర నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం.
మరి సాహిత్యకారుడి పాత్ర ఏమిటీ అంటే ఈ మొత్తానికి సృజనాత్మక రూపాన్నివ్వడం. వాస్తవ జీవన కాలపు చలనశీలతను ప్రతిఫలించడం. చారిత్రక వ్యక్తులను పాత్రలను చెయ్యడం నుంచి మొదలుపెట్టి ఇతివృత్త కాలపు నిజమైన వ్యక్తుల్లాంటి వారిని పాత్రలుగా సృష్టించడం. సంఘటనల్ని సృష్టించడం. అప్పుడా పాత్రలూ, సంఘటనలూ ఏక కాలంలో ఉండవు ఉంటాయి, జరగవు, జరుగుతాయి. ఇక్కడే ఊహకూ వాస్తవానికి మధ్య సాహిత్యకారుడు సృజించే ఇంద్రజాలం ఉంటుంది. ఏక దిశాత్మకమైన కాలంలో ఒక సంఘటన ఒకసారే జరుగుతుంది. కానీ దాన్ని పునఃసృజించే సాహిత్యకారుడు. చదివిన ప్రతీసారి మళ్లీ మళ్లీ జరిగేటట్టు చేస్తాడు. చరిత్రకారుడు చరిత్రను రికార్డ్ చేస్తే, సాహిత్యకారుడు దాన్ని గ్రామఫోన్ రికార్డ్ గా మార్చి మళ్లీ మళ్లీ play చేసుకొమ్మంటాడు.
1950-55 మధ్యకాలం ఈ నవలాకాలం. అంతకు ముందు ఐదు సంవత్సరాల కాలం, అంటే 1945-50 మధ్యకాలం దానికి పూర్వరంగం అని రచయిత అన్నారు కానీ, గతమంతా నేపథ్యమే. ఆ ఐదేళ్లూ సమీప గతం. రచయిత చిత్రించిన సామాజిక ఆర్థిక వ్యవస్థకు శతాబ్దాల చరిత్ర భూమికగా ఉంది. కథాకాలంలో జరిగిన సామాజిక సంచలనానికి కావలసిన కదలికను ముందున్న ఐదేళ్లలో జరిగిన పోరాటాలు ఉద్యమాలు ఇచ్చాయి. నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెంది బ్రిటీష్ ఆంధ్ర సరిహద్దు కు దగ్గరగా ఉన్న గ్రామం ఈ నవలా క్షేత్రం. 1945-50 కాలం ఒక చారిత్రక విభాత సంధ్య. పురాతన వ్యవస్థ కూలిపోయి అధునాతన వ్యవస్థ నిర్మితమౌతున్స మధ్య కాలం. ఈ దశ లోనే శతాబ్దాల ఫ్యూడల్ వ్యవస్థ అవశేషం మీద సాయుధ పోరాటం జరిగింది. రజాకార్ వంటి విధ్వంసకర శక్తులు విజృంభించగా అణచివేయబడ్డాయి.
వేర్పాటు ధోరణిని జాతీయభావం విలీనం చేసుకుంది. రాచరికాన్ని అంతమొందించి ప్రజాస్వామ్యం పాలనావ్యవస్థగా అవతరించింది. ఇక, 1950-55 మధ్యకాలం అంటే ఈ తెలిరేకల ఉషోదయ వేళ. మర్లపాడు అనే సిద్ధినేని గూడెం లో చేతివృత్తి కులాలు తమ మీద సాగిన చిరకాలపు శ్రమదోపిడికి, సాంస్కృతిక అణచివేతకు వ్యతిరేకంగా పనిముట్లు వదిలేశారు. ఒక్కటై నిలుచున్నారు. ఆత్మగౌరవం కోసం జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఆకలిని పేదరికాన్ని తట్టుకున్నారు. ఒకరు పడిపోకుండా మరొకరు పట్టుకోవడం మొదలుపెట్టి అందరూ పడిపోయే పరిస్థితి ఏర్పడినా ఒకరినొకరు పట్టుకుని చివరికి ఎవరూ పడిపోకుండా అందరూ నిలబడడం నవలా సారం. ఈ సాత్విక తిరుగుబాటు రజకులతో మొదలైంది. ఉతకడానికి వేసిన చొక్కాకు బొటనవేలు మును భాగమంత చిరుగు పడింది. కొర్రు పట్టిందేమో తెలియదని, కావాలంటే చొక్కా ఖరీదుని మేర గింజల్లో మినహాయించుకొమ్మని చెప్పినా వినక చాకలి బొర్రమ్మ ను మోతుబరీ, గొర్రెల కాపరీ అయిన కనకరాజు కొడుకు పోలురాజు దుర్భాషలాడడంతో తగవు మొదలైంది. ఇదేమని అడగడానికి వెళ్లిన బొర్రమ్మ భర్త చెన్నయ్య మీద కనకరాజు దాడి చెయ్యగా ఊరి చాకళ్లంతా ఆ ఇంటిని వెలివేశారు (మురగేశారు ).
తగవు తీర్చడానికి పిలిచిన ఊరి పెద్దలు జులుం ప్రదర్శించి వారిని లొంగదీయడానికి ప్రయత్నించడంతో ఊరి రజకులంతా కలిసి ఊరంతటినీ మురగేశారు. మురికి గుడ్డలూ ముట్టుగుడ్డలూ ఉతకడమంటే ఏమిటో తెలిసొచ్చింది. చావుకబురు చెప్పడానికి చాకలిలేడు. పెళ్లిళ్లకు పేరంటానికి రజకులు లేక అవి ’చలవ’చెయ్యలేదు. ఒక మహా సామాజిక సమరం మొదలైంది. ఈ ఆత్మగౌరవ పోరాటానికి ఆకలి పోరాటం తోడయ్యింది. మంగలి, వడ్రంగి, సాలె, కమ్మరి, కుమ్మరి, మాదిగ వంటి వృత్తి కులాల వారికి ఏటా రైతులు ధాన్యరూపంలో కొలిచి ఇచ్చే మేరల్ని పెంచమని ఎన్నాళ్లుగానో చేస్తున్న అభ్యర్థన నిరాదరణకు గురి కాగా వారంతా సమ్మెకు దిగారు. అడుగడుగునా గ్రామ జీవనం స్తంభించింది . వడ్రంగులు పెళ్లిపీటలు చెయ్యలేదు, భాషికాలు కట్టలేదు. కంసాలి తాళిబొట్టు చెయ్యలేదు. మంగళ్లు మంగళవాద్యాలు వాయించలేదు.
విరిగిన నాగలి బాగుచేసేవాడు లేడు. నాగలి కర్రును మొనదేల్చేవాడు లేవడు. క్షవరం లేక మనుషులు మాసిపోయారు. చివరికి దొడ్లో గేదె చనిపోతే లాక్కుపోయే నాథుడు, మాదిగ లేడు. వ్యవసాయంతో పాటు సమస్త సామాజిక జీవన పార్శ్వాలు స్తంభించిపోయాయి. గ్రామమే యుద్ధభూమి. సామాజిక అవసరాలే ఆయుధాలు. సాధారణంగా పోరాటాల్లో పనిముట్లు ఆయుధాలౌతాయి. పనిముట్లు క్రింద పడెయ్యడమే ఇక్కడ యుద్ధం. ఇరుపక్షాలకు కనిపించని గాయాలయ్యాయి. చెన్నుడి హత్య మినహా రక్తపు చుక్క ఒలకకుండా ఒక glorious revolution జరిగింది. సత్యం గెలిచి, మేరలు పెరిగాయి. ఆత్మ గౌరవం నిలబడింది. ఇదీ కథ. నవలలో చేతివృత్తి కులాల పాత్రల తర్వాతి తరాలు చదువుకుని ఉన్నతస్థానాలు చేరుకుని సామాజిక గౌరవాన్ని పొందుతున్న వర్తమానం లో కథ మొదలై గతం లోకి ప్రయాణించి మళ్లీ వర్తమానం లోకి తేరుకుని , చరిత్ర అంటే గతానికి వర్తమానానికి జరిగే అంతులేని సంభాషణ అన్న ఇ. హెచ్. కార్ మాటల్ని రుజువుచేస్తూ ముగుస్తుంది. ఈ సంభాషణలో రెండు పొరలున్నాయి. చారిత్రక ఘటన జరుగుతున్న virtual time లో గతం తో చేసే సంభాషణ మొదటిది. అది చరిత్రకారుడు చేసేది. ఆ సంభాషణా సారాన్ని సాహిత్యం చేసే క్రమంలో దాన్ని మన వర్తమానంతో చేయించే సంభాషణ రెండవది. ఈ నవల చెయ్యాల్సినదీ, చేస్తున్నదీ అదే.
ఈ నవల కట్టుకథ కాదు. తెలంగాణా గ్రామాలలో అనేక చోట్ల జరిగిన యదార్థ ఘటనల సమాహారం. ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ వంటి సంస్థలు కలిగించిన చైతన్య ఫలితం. ఈ సంఘటనలన్నీ ఒకే చోట జరిగినవి కాకపోవచ్చు. జరిగినట్లు చెప్పడం రచయిత ఆశావహం. బహుశా భవిష్యత్ నిర్దేశం. అంతేకాదు, ఈ నవల సిసలైన మన సామాజిక నవల. కులం, వర్గం తమ అస్తిత్వాలను నిలుపుకుంటూనే ఏకమైన సందర్భాన్ని చూపించిన నవల. అంబేద్కర్ మారక్స్ ల ప్రస్తావన లేకుండానే వారిద్దరినీ కలిపేసిన సందర్భం. సిద్ధాంతాన్ని సృష్టిస్తే దాన్ని అనుసరించి జీవితమూ సమాజమూ నడవవు, జీవితమూ సమాజమూ నడిచే నడకలోనుంచే సిద్ధాంతం పుడుతుంది అన్న కొడవటిగంటి కుటుంబరావు మాటల్ని చారిత్రక ఘటనల ఆధారంగా రాసిన ఈ నవల నిజం చేస్తున్నది. ఆత్మగౌరవ, ఆర్థిక సమానత్వ పోరాటాలు కలిసికట్టు గా సాగాల్సిందేనని చరిత్ర సాక్షిగా చెబుతున్నది.
ఈ నవలను చదువుతున్నపుడు ఇటాలియన్ మార్క్సిస్ట్ మేథావి ఆంటోనియో గ్రాంసీ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతీయ చరిత్రకారుడు రంజిత్ గుహ గుర్తుకు రాక మానరు. ఆధిపత్య వర్గాల తో పోరాటానికి కార్మికవర్గం కలుపుకోవలసిన ఇతర వర్గాలను subalterns గా, అంటే ఉపశ్రేణులుగా మొదటిసారి ప్రస్తావించాడు గ్రాంసీ. రైతులు,చేతివృత్తుల వారు, గిరిజనులు, మహిళలే ఈ ఉపశ్రేణులు. దీన్ని అందిపుచ్చుకున్న రంజిత్ గుహ వలస భారతదేశ చరిత్ర రచనలో విస్మరణకు గురైన ఈ వర్గాల మీద వెలుతురును ప్రసరింప చేశాడు. భారత స్వాతంత్య్ర పోరాటం కేవలం శిష్ట వర్గాలు (elite groups) చేసింది మాత్రమే కాదనీ, ఆ వర్గాల ప్రమేయం లేకుండానే ఉపశ్రేణులు తమంత తాముగా నిర్వహించిన పాత్ర సరిగా ఉటంకించబడడం గానీ, వ్యాఖ్యానించబడడం గానీ జరగలేదనీ అన్నాడు. ఈ వ్యాఖ్య చేస్తూ ఆయన రాసిన వ్యాసం ప్రపంచ చరిత్రలో Subaltern perspective అనే నూతన దృక్కోణానికి తలుపులు తెరిచింది.
స్వాతంత్య్రానంతర చరిత్రకు లేదా నిజాం పాలనానంతర తెలంగాణ తక్షణ చరిత్రకు సంబంధించి ఉపశ్రేణుల చైతన్యాన్ని ఈ నవల శక్తిమంతంగా వ్యక్తీకరించిందనడంలో సందేహం లేదు. అంతేకాదు నిచ్చెన మెట్ల కులవ్యవస్థ లో కింది కులాలు కూడా తమ కంటే క్రింది కులాల పట్ల ఆభిజాత్యం ప్రదర్శిస్తాయని పోలురాజు బొర్రమ్మను తూలనాడడం లో రచయిత గుర్తించారు. ఉపశ్రేణులు తమకు మార్గదర్శనం చేయడంతో పాటు నాయకత్వం వహించే వర్గాన్ని తమనుంచే రూపొందించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తూ వారిని organic intellectuals అన్నాడు గ్రాంసీ. ఈ సవర్గ మేథావులకు అద్భుత ఉదాహరణ ఇందులో రజకులకు సారథ్యం వహించిన పానయ్య. గ్రాంసీ ని చదవకుండానే ప్రపంచంలో చాలాచోట్ల ఆయన భావజాలం ఆచరణలోకి రావడాన్ని సద్యోజనిత గ్రాంసీజం (instinctive gramscism) అన్నారు. ఇదీ అటువంటిదే. రంజిత్ గుహ ఉపశ్రేణుల మీద రాసిన వాటిల్లో తెలంగాణ సాయుధపోరాటం లో మహిళలు నిర్వహించిన పాత్ర మీద రాసిన వ్యాసం కూడా ఒకటని చెప్పడం ఇక్కడ అప్రస్తుతం కాకపోవచ్చు.
ముందే చెప్పినట్టు ఇది కేవలం చరిత్ర కాదు, సాహిత్యం కూడా. చరిత్ర అస్థిపంజరమైతే (structure), సాహిత్యం రక్తమాంసాలు. నవల రచనలో గ్రామీణ జీవనంలో వివిధ వృత్తుల వారు ఒకరి మీద మరొకరు అనివార్యంగా ఆధారపడడం గురించి మొదలుపెట్టి వారి మధ్య ఉండే సాంస్కృతిక సారూప్యతనూ, వైవిధ్యాన్నీ ప్రతిష్టించడంలో రచయిత ఎంతో ప్రతిభను చూపారు. ఏదో ఒక వృత్తి మూలాలు రచయితలో లేనట్లయితే రచనకు ఈ ప్రాణశక్తి వచ్చేది కాదు. రజకులలో కలిగిన చైతన్యాన్ని ఇతరవృత్తుల వారికి వ్యాపింప చెయ్యడంలో భాగంగా ఎప్పుడూ రజక వీథికి మాత్రమే పరిమితమై ప్రదర్శించే వీరభద్ర, మడేలు పురాణాల్ని ఊరు మధ్య జెండా అరుగు మీద పటం వారు (రజకుల ఆశ్రిత కులం) ప్రదర్శించేటట్టుగా కథని నడిపించి ఇతరవృత్తుల వారందరికి సహానుభూతి కలిగించడంలో రచయిత గొప్ప రచనా కౌశలం ప్రదర్శించారు. అట్లాగే కంసాలి, మంగలి, మాదిగ వృత్తులనూ వారి సాంస్కృతిక జీవనాన్ని సజీవంగా ప్రతిఫలింప చేశారు.
అయితే చేతివృత్తుల పట్ల రచయిత కున్న గాఢమైన అనురక్తి వల్ల వారు విజయం సాధించవలసిన అవసరాన్ని అంతే గాఢంగా నమ్మడంవల్ల కథ లోనూ, కథ లోని పాత్రల చైతన్యం లోనూ రచయిత కొంత జోక్యం చేసుకున్నారనిపిస్తుంది. మనుషులు మంచి చెడుల మిశ్రమంగా ఉంటారనీ, పరిస్థితులు మంచినీ లేదా చెడునీ ప్రజ్వలింప చేస్తాయనీ కాక, కేవలం కొన్ని మంచి పాత్రల్నీ కొన్ని చెడు పాత్రల్నీ సృష్టించినట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో పాత్రలు రచయిత చెప్పినట్టు మాట్లాడాయని తెలిసిపోతుంది. ఒకేలా ఉండే అచ్చు పాత్రలకు మినహాయింపైన పటేలు పాత్ర కూడా ముందు చెడుగా ఉండి తర్వాత మంచిగా మారుతుంది. ఇది రచనల్లో సాధారణంగా కనిపించేదే. కానీ ఉదాత్తంగా, మంచిగా కనిపించే మనుషులు కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు ఎంతో కొంత స్వార్థంతో ప్రవర్తిస్తారు. దాన్ని కూడా ప్రతిఫలించిన రచన సజీవంగా మిలమిల లాడుతుంది. ఆ ప్రయత్నం ఈ నవలలో కొంత జరిగింది, మరింత జరగాలనిపిస్తోంది. ఇది గొప్ప ప్రయత్నం. రచయిత సుబ్బాచారి గారికి నా ఆలింగన.
కొప్పర్తి వెంకటరమణమూర్తి