ప్రజాస్వామ్యం, మానవ హక్కులు పరిపూర్ణంగా అనుభవంలోకి వచ్చే వరకు పోరాటం కొనసాగవలసిందే. దీనికి విరామం వుండరాదు. తరతమ భేదాల్లో స్వార్థపర శక్తులు ఏదో ఒక ముసుగులో ప్రపంచమంతటా చెలరేగుతూ వీటిని చెరబడుతున్నారు. ఇరాన్‌లో మహిళల కోసం, వారి హక్కుల కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిష్కరణ కోసం, ఉరి శిక్ష రద్దు కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్న 51 ఏళ్ళ నర్గిస్ మహమ్మదికి నోబెల్ శాంతి బహుమతి లభించడం అమిత హర్షామోదాలను కలిగిస్తున్న పరిణామం. సంకెళ్ళను వ్యతిరేకించి స్వేచ్ఛను కోరే ప్రతి ఒక్కరూ ఆనందించవలసిన సందర్భమిది. నర్గిస్ నోబెల్ శాంతి బహుమతిని పొందిన 19వ మహిళ, రెండో ఇరానీ స్త్రీ. ఇరాన్‌లో డిఫెండర్స్ ఆఫ్ హ్యూమస్ రైట్స్ సెంటర్ (మానవ హక్కుల మద్దతుదారుల కేంద్రం)ను నెలకొల్పిన మాజీ న్యాయమూర్తి షిరిని ఎబాదికి 2003లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
అదే కేంద్రానికి ప్రస్తుతం నర్గిస్ ఉపాధ్యక్షురాలుగా వుండడం విశేషం. హిజాబ్ (తలగుడ్డ) సరిగా ధరించనందుకు ఇరాన్ నైతిక పోలీసులు అరెస్టు చేసిన 22 ఏళ్ళ మాసా అమిని వారి కస్టడీలో మరణించిన తర్వాత పెల్లుబికిన మహిళల పోరాటానికి జైల్లో నుంచే నర్గిస్ మద్దతు సమీకరించారు. ఇంజినీరింగ్ చదువుకొన్న ఆమె కాలేజీ రోజుల నుంచి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఐదుసార్లు శిక్షలు పడ్డాయి. 13 సార్లు జైలుకు వెళ్ళారు. మొత్తం 35 ఏళ్ళ శిక్ష పడింది. ఇప్పుడు టెహ్రాన్‌లోని ఎవిన్ జైల్లో వున్నారు. ఇరాన్ మహిళల హిజాబ్ వ్యతిరేక పోరాటం ఏడాదికి మించి నిరవధికంగా కొనసాగుతున్నది. పురుషులు కూడా మద్దతు ఇస్తున్న ఈ పోరాటంలో 530 మంది మరణించారు. 22 వేల మంది అరెస్టయ్యారు. 22 ఏళ్ళ క్రితం మొదటిసారి నిర్బంధానికి గురైన నర్గిస్ మహమ్మది 154 కొరడా దెబ్బలు తిన్నారు. చివరి సారి 2021లో జైలుకు వెళ్ళి కొనసాగుతున్నారు.భర్తకు, పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు కొన్ని సంవత్సరాలుగా దూరమయ్యారు.
ఇరాన్‌లో మార్పు తథ్యమనే దృఢ స్వరాన్ని ఆమె ఇప్పటికీ వినిపించడం అసాధారణమైన విషయం. ఈమెకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటనను పక్షపాతంతో, రాజకీయ దురుద్దేశంతో కూడినదిగా ఇరాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అందులో వాస్తవం లేదని అనలేము. పాశ్చాత్య దేశాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం నోబెల్ బహుమతిని ఉపయోగించుకొన్న సందర్భాలు లేకపోలేదు. అంత మాత్రాన తమ దేశంలో మహిళలకు బొత్తిగా స్వాతంత్య్రం లేకుండా చేయడాన్ని, నిరంతరం అణచివేతలో వుంచడాన్ని ఇరాన్ పాలకులు సమర్థించుకోజాలరు. ఒకప్పుడు షా పాలనలో ప్రజాస్వామ్య స్వేచ్ఛలను అనుభవించిన దేశాన్నే తాము తీవ్ర నిర్బంధ నియమాలు, మహిళా వ్యతిరేక చట్టాల నిరంకుశ పాలనలోకి నెట్టివేశామనే సంగతిని వారు గుర్తించాలి. మత నియమాల పేరుతో నియంతృత్వాన్ని ఎల్లకాలం కొనసాగించలేరు. ప్రజలు చైతన్యవంతమైతే ఆ ప్రభంజనాన్ని తట్టుకోడం సైనిక శక్తికి సాధ్యం కాదు. ప్రజలతో అవగాహన, అంగీకారం కలిగి వున్నంత కాలమే ఏ పాలకులైనా అధికారంలో కొనసాగగలుగుతారు.
నర్గిస్‌కు నోబెల్ బహుమతి ప్రకటన ఇరాన్ మహిళల ధైర్య సాహసాలను, వారి పట్టుదలను చాటుతున్నదని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం ప్రకటించింది. ఇరాన్‌లోను, ఇతర మరి కొన్ని చోట్ల హక్కుల కోసం పోరాడుతున్న మహిళలందరికీ ఇది పురస్కారమేనని అభిప్రాయపడింది. చుట్టూ వున్న నాగరక, స్వేచ్ఛాయుత ప్రపంచం ఇరాన్ మహిళలపై తన ప్రభావం చూపుతున్నదని బోధపడుతున్నది. 2020లో చేపట్టిన గమాన్ అనే ఒక స్వతంత్ర సర్వే ఫలితాలు గమనించదగినవి. మహిళలు తలగుడ్డ ధరించాలనే నియమాన్ని 58% మంది ఇరానీయన్లు పూర్తిగా తిరస్కరిస్తున్నారని, 72% మంది నిర్బంధ హిజాబ్ ధారణను మాత్రం వ్యతిరేకిస్తున్నారని, 15% మంది మాత్రం దానిని ధరించాలని కోరుకొంటున్నారని ఈ సర్వే వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా హిజాబ్ పట్ల వ్యతిరేకత పుంజుకొన్నట్టు తెలుస్తున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ వైఖరిని మార్చుకోని పాలకులకు వారు తప్పనిసరిగా బుద్ధి చెబుతారు.
2014లో పాకిస్థాన్‌కు చెందిన మలాల యూసఫ్ జాయ్‌కి సగం నోబెల్ శాంతి బహుమతి లభించింది. అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరాలే. మహిళలు, పిల్లలు చదువుకొని తీరాలని, అది వారి హక్కు అని భావించి ఆమె అందుకోసం ఉద్యమించారు. 2012 అక్టోబర్ 9న పాక్‌లోని స్వాత్ జిల్లాలో మలాల, ఆమె స్నేహితురాలు పరీక్షలు రాసి ఒక బస్సులో వెళుతుండగా అక్కడి తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. ఆమె తలకు గాయమైంది. పురుషుడి కంటే మహిళ బలహీనురాలు కాబట్టి ఆమెను అణచి వుంచడం తేలిక అనుకొనే వారికి నర్గిస్ మహమ్మది ఒక సవాలు.ఆమె పోరాటం సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుందాం.