ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీసులు
రివార్డులు అందజేసిన హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యా
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఉత్తమ పనితీరు కనబర్చిన ముషీరాబాద్ పోలీసులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అభినందించారు. ఈ మేరకు వారికి రివార్డులు అందజేశారు. ఎన్నికల ప్రకటన రావడంతో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క రౌడీషీటర్‌ను ముషీరాబాద్ పోలీసులు బైండోవర్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌బిడబ్లూలను అమలు చేశారు. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్లు మహ్మద్ మోయినుద్దిన్, మహ్మద్ మహబూద్ అలియాస్ లడ్డాఫ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు నిందితులు ముషీరాబాద్ పోలీసుల నుంచి నాలుగేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఇద్దరు నిందితులు ముషీరాబాద్, పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లలో పలు నేరాలకు పాల్పడ్డారు. వీరు చాలా కేసుల్లో మోస్ట్ వాటెండ్ క్రిమినల్స్‌గా ఉన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఇన్స్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్, డిఐ వెంకట్ రెడ్డి, ఎస్సైలు ప్రసాద్ రెడ్డి, చలపతి రెడ్డి, ప్రేమ్‌కుమార్, హెచ్‌సి కిషోర్, పిసిలు ప్రకాష్, సాయికుమార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషర్ సందీప్ శాండిల్యా అభినందించారు.