సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకున్న పోలీసులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అభినందించారు. ఐసిసిసిలోని తన కార్యాలయానికి శుక్రవారం వారిని పిలిపించుకుని అభినందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగల్ హాట్ పిఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్న జి.అంబిక సరిహద్దు పోలీస్‌స్టేషన్ షాహినాయత్ గంజ్ పరిధిలో ఓ పొలిటికల్ పార్టీకి సంబంధించిన కొంత మంది పురుషులు, మహిళలు గొడవ పడుతున్నారు. ఇది గమనించిన ఎస్సై అంబికా వెంటనే షాహినాయత్ గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తరవాత వారితో పాటు కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా చర్యలు తీసుకున్నారు. దీనికి గాను హైదరాబాదు పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఎస్సై అంబికాను పిలిచి ఆమె ధైర్య సాహసానికి , తక్షణమే స్పందించినందుకు మెచ్చుకొని రివార్డు ఇచ్చారు.
మరో సంఘటనలో ధైర్యంగా బోగస్ ఓట్లను అడ్డుకున్న పిసి వినయ్ కుమార్‌ను అభినందించి రివార్డు అందజేశారు. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలోని పోలింగ్ బూత్‌లో కొందరు బోగస్ ఓట్లు వేయటానికి వచ్చారు. వారిని గుర్తించిన కానిస్టేబుల్ వినయ్ వారిని అడ్డుకున్నాడు. వెంటనే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉమెన్ కానిస్టేబుల్ భోస్లే క్రిష్ణ కుమారి కాలాపత్తర్ పిఎస్ పరిధిలో పోలింగ్ భూత్ నందు విధులు నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి బోగస్ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేశారు. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయించారు. కానిస్టేబుల్ ధైర్యానికి మెచ్చి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అభినందించి, రివార్డును అందజేశారు. కార్యక్రమములో అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ , జాయింట్ సిపి పి.విశ్వప్రసాద్ పాల్గొన్నారు.